సీఎం చంద్రబాబుతో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ భేటీ.. ఏపీకి పూర్తి సహకారం అందిస్తామని హామీ
సీఎం చంద్రబాబుతో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ భేటీ.. ఏపీకి పూర్తి సహకారం అందిస్తామని హామీ
Chandra Babu Naidu


అమరావతి, 30 మే (హి.స.)ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయ మార్గాలు సృష్టించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా, ఉద్యాన పంటల నుంచి లభించే ఫైబర్కు విలువ జోడించి జౌళి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు పలు కీలక ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్తో సీఎం చంద్రబాబు సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అమరావతిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎం బలంగా విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు, పోకచెక్క వంటి పంటల నుంచి లభించే పీచును వాణిజ్యపరంగా వినియోగించుకునే అవకాశాలను సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా కడప, అనంతపురం, నంద్యాల, గోదావరి జిల్లాల్లో అరటి కాండం నుంచి పీచు తీసే కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. పంట కోత తర్వాత వృథాగా పోయే అరటి కాండం నుంచి పర్యావరణ అనుకూల ఫైబర్ తయారు చేయడం ద్వారా వస్త్ర పరిశ్రమలో జనపనారకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియను స్వయం సహాయక సంఘాల ద్వారా క్లస్టర్ పద్ధతిలో ప్రోత్సహించాలని సూచించారు.

అలాగే, గిరిజన, మెట్ట ప్రాంత రైతులకు ప్రయోజనం చేకూరేలా వెదురు ఫైబర్ ప్రాసెసింగ్ యూనిట్లను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల రైతులకు 30 ఏళ్ల పాటు నిరంతర ఆదాయం లభిస్తుందని స్పష్టం చేశారు. తీర ప్రాంత జిల్లాల్లో కొబ్బరి పీచు పరిశ్రమను బలోపేతం చేయాలని, కాయిర్ జియో టెక్స్టైల్స్ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని కోరారు. ఉప్పునీటిని, కీటకాలను తట్టుకునే గుణం ఉన్న కొబ్బరి పీచుతో తయారు చేసే జియో-రోల్స్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందని, నేల కోత నివారణకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు.

పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా, మూడు రాష్ట్రాలకు కూడలిగా ఉన్న కుప్పంలో పీఎం మిత్రా పార్కు ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ఫైబర్ టు ఫ్యాషన్ విధానానికి ఈ పార్కు దోహదపడుతుందని తెలిపారు. అమరావతిలో నిఫ్ట్ ఏర్పాటుకు గతంలోనే 10 ఎకరాల భూమిని కేటాయించామని, దీనికి అవసరమైన రూ. 280 కోట్ల నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు మంగళగిరిలో చేనేత పార్కు, అమరావతిలో చేనేత, హస్తకళల మ్యూజియం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, జౌళి మంత్రిత్వ శాఖ తరఫున ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande