డిజిటల్ అరెస్టులని ఫోన్ చేసేవాళ్లు అరెస్టవ్వాలి: సీఎం చంద్రబాబు
డిజిటల్ అరెస్టులని ఫోన్ చేసేవాళ్లు అరెస్టవ్వాలి: సీఎం చంద్రబాబు
CM N. Chandrababu Naidu marks one year of TDP-led NDA victory in Andhra Pradesh


మంగళగిరి, 30 మే (హి.స.)డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్లు చేసి ప్రజలను భయపెడుతూ డబ్బులు దోచుకునే వారే అరెస్ట్ కావాలి. ఆ దిశగా కఠిన చర్యలు తీసుకోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు శాఖను ఆదేశించారు. ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న సొమ్మును సైబర్ నేరగాళ్లు దోచుకుంటుంటే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ పరిస్థితిని అరికట్టాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సైబర్ నేర రహితంగా మార్చడమే లక్ష్యమని, ఏపీ ప్రజలను మోసం చేస్తే తప్పించుకోలేమనే భయం నేరగాళ్లకు కలగాలని ఆయన హెచ్చరించారు. సచివాలయంలో సైబర్ నేరాల కట్టడిపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో సైబర్ నేరాలను సమూలంగా నిర్మూలించేందుకు పోలీసు శాఖ ‘ఏపీ సైబర్ గార్డ్’ పేరుతో ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముఖ్యమంత్రికి వివరించారు. ఆరు స్తంభాల (6 పిల్లర్స్) ఆధారంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా సైబర్ వార్ రూం, 1930 కాల్ సెంటర్ డాష్బోర్డ్, టెక్నాలజీ-ఏఐ వినియోగం, పోలీసులకు శిక్షణ, 3-టైర్ ఆర్కిటెక్చర్, ప్రజా చైతన్యం వంటివి ఉంటాయని పేర్కొన్నారు.

మంగళగిరిలోని ‘ప్రభల టెక్ పార్క్’లో అత్యాధునిక సదుపాయాలతో రాష్ట్రస్థాయి సైబర్ వార్ రూం ఏర్పాటు చేస్తున్నామని, ఇది 30 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని డీజీపీ తెలిపారు. సైబర్ మోసంపై ఫిర్యాదు అందిన వెంటనే ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసి, గోల్డెన్ అవర్ టైంలో స్పందించి బాధితుల డబ్బు బదిలీ కాకుండా చూడాలని సీఎం సూచించారు. ఇందుకు బ్యాంకులు పూర్తి సహకారం అందించాలని కోరారు.

పోలీసు పెట్రోలింగ్ తరహాలోనే ‘సైబర్ పెట్రోలింగ్’ కూడా నిరంతరం జరగాలని చంద్రబాబు అన్నారు. నేరం జరగకముందే ప్రజలను అప్రమత్తం చేయడంపై దృష్టి పెట్టాలని, ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలపై వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. ఆర్బీఐ, ప్రముఖ బ్యాంకులతో కలిసి MuleHunter.AI వంటి టెక్నాలజీలను వాడతామని, ఏడాదిలో 500 మంది పోలీసు అధికారులకు శిక్షణ ఇస్తామని డీజీపీ వివరించారు. 28 జిల్లాల్లో సైబర్ యూనిట్లు, 4 ప్రాంతీయ హబ్లు ఏర్పాటు చేసి నేరాలకు అడ్డుకట్ట వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సైబర్ నేరాల నియంత్రణలో ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande