
కేదార్నాథ్, 30 మే (హి.స.)
పవిత్ర కేదార్నాథ్ క్షేత్రంలో ఇకపై వీఐపీ దర్శనాలకు చెక్ పడనుంది. సాధారణ భక్తుల దర్శన విధానం పూర్తిగా మారనుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కేదార్నాథ్ ధామ్లో రోజురోజుకూ భక్తుల రద్దీ బాగా పెరుగుతోంది. దీనికి తోడు వీఐపీల తాకిడి కూడా ఎక్కువ అవుతోంది. దీనితో ఒక పద్ధతిలో దర్శన ఏర్పాట్లు లేకపోవడంతో సాధారణ భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని సరిదిద్దడానికి బద్రీనాథ్- కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒక కొత్త నిబంధనల పత్రాన్ని విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై భక్తులు ఆలయంలో సుగమ దర్శనం (సులువైన దర్శనం) చేసుకోవడానికి రూ.1100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై కేదారీశ్వరుడి సన్నిధికి వచ్చేవారు మంత్రులైనా, సెక్యూరిటీ గార్డులైనా, సాధారణ భక్తులైనా లేదా ఎంతటి ప్రముఖులైనా సరే, ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారం కచ్చితంగా ఎంట్రీ స్లిప్ తీసుకోవాల్సి ఉంటుంది.
భక్తుల సౌకర్యం కోసమే!
'కేదార్నాథ్లో వాతావరణం చాలా దారుణంగా ఉంటుంది. అయినప్పటికీ నిరంతరం భక్తుల సంఖ్య పెరుగుతోంది. వారు ఈ ప్రతికూల వాతావరణంలో గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ఈ కీలక నిర్ణయం తీసుకున్నాం' అని ఆలయ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోహన్ సింగ్ రంగద్ తెలిపారు. యాత్ర నిర్వహణ మరింత క్రమబద్ధంగా, సురక్షితంగా, సమయపాలనతో కూడినదిగా మార్చడమే ఈ కొత్త విధానం ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
కొత్త నిబంధనల ప్రకారం, నిర్ణీత ఫీజు చెల్లించిన భక్తులకు ఒక నిర్దిష్ట సమయం లోపలే సుగమ దర్శనం చేసుకునే సదుపాయం కల్పిస్తారు. దీని వల్ల గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే ఇబ్బంది తప్పుతుంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, అనారోగ్యంతో ఉన్న యాత్రికులకు ఇది ఎంతో ఊరట కలిగిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi