
ఆదోని, 30 మే (హి.స.) కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలం పరిధిలోని పాండవగల్లు గ్రామ సమీపంలో ఒక ఆటో, బైక్ ఒకదానికొకటి అత్యంత వేగంగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్పై వెళ్తూ చనిపోయిన వారిని గణేకల్ గ్రామానికి చెందిన వీరేశ్, మహీంద్రాగా పోలీసులు గుర్తించారు. అలాగే ఆటోలో ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుడిని కౌతాళం గ్రామానికి చెందిన విశ్వనాథ్గా నిర్ధారించారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆదోని పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో గణేకల్, కౌతాళం గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. అతివేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV