ట్విషా శర్మ కేసు: తాను పనిచేసిన కోర్టుకే నిందితురాలిగా వచ్చిన మాజీ జడ్జి గిరిబాలా సింగ్
ట్విషా శర్మ కేసు: తాను పనిచేసిన కోర్టుకే నిందితురాలిగా వచ్చిన మాజీ జడ్జి గిరిబాలా సింగ్
sharma


హైదరాబాద్, 30 మే (హి.స.)ఒకప్పుడు తాను న్యాయమూర్తిగా తీర్పులు చెప్పిన కోర్టుకే, ఇప్పుడు ఓ నిందితురాలిగా హాజరయ్యారు మాజీ జిల్లా జడ్జి గిరిబాలా సింగ్. తన కోడలు, నటి-మోడల్ అయిన ట్విషా శర్మ వరకట్న వేధింపుల మృతి కేసులో ఆమెను, ఆమె కుమారుడు సమర్థ్ సింగ్ను సీబీఐ అధికారులు శుక్రవారం భోపాల్ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం ఇద్దరికీ ఐదు రోజుల సీబీఐ కస్టడీ విధించింది.

2023 ఫిబ్రవరిలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా పదవీ విరమణ చేసిన గిరిబాలా సింగ్ను సీబీఐ అధికారులు కోర్టుకు తీసుకురావడంతో ప్రాంగణంలో నాటకీయ వాతావరణం నెలకొంది. ఒకప్పుడు తమ అధికారిగా ఉన్న ఆమెను నిందితురాలిగా చూడటానికి న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పెద్ద ఎత్తున గుమిగూడారు. కోర్టు భవనంలోని మూడో అంతస్తులో ఉన్న గదికి భద్రత నడుమ ఆమెను తీసుకెళ్లారు.

దాదాపు రెండు గంటలకు పైగా సాగిన విచారణ సమయంలో గిరిబాలా సింగ్, ఆమె కుమారుడు సమర్థ్ నిందితుల బోనులో నిలబడ్డారు. విచారణ జరుగుతున్నంత సేపు ఆమె ప్రశాంతంగా కనిపించారు. తన న్యాయవాదులతో, కుమారుడితో మాట్లాడుతూనే ఉన్నారు.

సమర్థ్ సింగ్తో వివాహం జరిగిన కొద్ది నెలలకే మే 12న ట్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో మరణించారు. వివాహం తర్వాత తన కుమార్తెను వరకట్నం కోసం, ఇతర కారణాలతో గిరిబాలా సింగ్, సమర్థ్ తీవ్రంగా వేధించారని ట్విషా కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ కేసుపై తీవ్ర ఒత్తిడి రావడంతో తొలుత భోపాల్ పోలీస్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించగా, ఆ తర్వాత కేసును సీబీఐకి బదిలీ చేశారు. గురువారం సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ అధికారులు గిరిబాలా సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందే ఆమె కుమారుడు సమర్థ్ను అరెస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande