
నల్లగొండ, 30 మే (హి.స.)
నల్లగొండ జిల్లాలో శనివారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
వివరాల్లోకి వెళితే... చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జాతీయ రహదారి 65పై ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు ప్రయాణిస్తుండగా ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్, అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. ప్రయాణికులను వెంటనే కిందకు దిగిపోవాలని హెచ్చరించారు.
ప్రయాణికులు కిందకు దిగిన కొద్ది నిమిషాలకే మంటలు వేగంగా వ్యాపించి బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. చూస్తుండగానే బస్సు మంటల్లో కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులతో పాటు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇంజిన్లో సాంకేతిక లోపమే ప్రమాదానికి ప్రాథమిక కారణంగా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi