
అజ్మీర్, 30 మే (హి.స.)
రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో కాలిపోయిన కారులో నాలుగు మృతదేహాలు లభించిన ఘటన.. తొలుత ఘోర రోడ్డు ప్రమాదంగా అందరూ భావించారు. కానీ, పోలీసుల దర్యాప్తులో ఇది పక్కా ప్రణాళికతో, అత్యంత కిరాతకంగా జరిగిన నలుగురి హత్య అని తేలడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. రెండో పెళ్లి చేసుకున్న తండ్రిపై పగ పెంచుకున్న ఆయన మైనర్ కుమారుడే.. తన తల్లి, సోదరితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ దారుణ ఘటనలో మాజీ సర్పంచ్ రామ్ సింగ్ చౌదరి, ఆయన తల్లి పూసీ దేవి, రెండో భార్య సూర్యగ్యాన్ దేవి, మేనకోడలు మహిమ చౌదరి ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 28వ తేదీ తెల్లవారుజామున అజ్మీర్కు 60 కిలోమీటర్ల దూరంలోని శ్రీరాంపుర గ్రామ సమీపంలో హైవేపై పూర్తిగా కాలిపోయిన మహీంద్రా స్కార్పియోలో వీరి మృతదేహాలను గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ హత్యలకు దాదాపు ఐదు నెలలుగా ప్రణాళిక రచించారు. రామ్ సింగ్ మొదటి భార్యకు పుట్టిన 17 ఏళ్ల కుమారుడు, క్రైమ్ షోలు, ఆన్లైన్ గేమ్ల ప్రభావంతో ఈ హత్యకు పథకం పన్నాడు. ఇందుకోసం ఆన్లైన్లో పదునైన కత్తిని ఆర్డర్ చేయడమే కాకుండా, తుపాకీని సంపాదించడానికి కూడా ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది.
27న ఇంట్లో జరిగిన గొడవ అనంతరం నిందితుడు తన తండ్రి, సవతి తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అతడి తల్లి సునీత, సోదరి సరిత కూడా సహాయం చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి అరుపులు విని అడ్డుకోబోయిన బామ్మ పూసీ దేవి, మేనకోడలు మహిమపై కూడా పదునైన ఆయుధాలతో దాడి చేసి, వారి గొంతులు కోసి కిరాతకంగా చంపేశారు.
హత్యల అనంతరం, ఈ ఘోరాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మృతదేహాలను ఎస్యూవీలో ఉంచి, ఇంటికి 500 మీటర్ల దూరంలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే, ఫోరెన్సిక్ ఆధారాలు వారి పథకాన్ని బట్టబయలు చేశాయి. ప్రమాదంలో కాకుండా కత్తిపోట్ల వల్లే మరణాలు సంభవించాయని పోస్ట్మార్టంలో తేలింది. ఇంట్లో రక్తపు మరకలను కడిగేందుకు ప్రయత్నించిన ఆనవాళ్లు కూడా లభించాయి.
2016లో రామ్ సింగ్ తన మొదటి భార్య సునీతకు విడాకులు ఇవ్వకుండానే రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఒకే ఇంట్లో నివసిస్తున్నప్పటికీ, మొదటి భార్యను, ఆమె పిల్లలను శారీరకంగా, మానసికంగా హింసించేవాడని పోలీసులు తెలిపారు. ఈ దీర్ఘకాలిక కలహాలే ఈ దారుణానికి దారితీశాయని భావిస్తున్నారు. అనుమానం రాకుండా ఉండేందుకు, బంధువుల మధ్య సునీత గుండెలు బాదుకుంటూ ఏడవడాన్ని ఒక నాటకంగా పోలీసులు అభివర్ణించారు.
బంధువులందరితోపాటు నిందితుడి తల్లి (రామ్ సింగ్ మొదటి భార్య) కూడా ఏడుస్తుంటే.. 17 ఏళ్ల కుర్రాడు మాత్రం ఎలాంటి చలనం లేకుండా చాలా ప్రశాంతంగా తల్లి పక్కన కూర్చుని చాయ్ తాగుతూ ఆమెను ఓదారుస్తున్నాడు. ఇంత పెద్ద ఘోరం జరిగితే ఒక కొడుకు ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటాడనే అజ్మీర్ ఎస్పీ హర్షవర్ధన్ అనుమానమే ఈ మిస్టరీని ఛేదించింది.
ఈ కేసులో రామ్ సింగ్ మొదటి భార్య సునీత (43), కుమార్తె సరిత (18)లను పోలీసులు అరెస్ట్ చేయగా, బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. టెక్నికల్, ఫోరెన్సిక్ ఆధారాలతో కేసును ఛేదించినట్లు అజ్మీర్ ఎస్పీ హర్ష్ వర్ధన్ అగర్వాల్ ధ్రువీకరించారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నామని, ఈ హత్యలలో ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi