ఐటీ దిగాలు..కొత్త ఉపాధి జిగేలు
ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ఐటీ .
jobs


హైదరాబాద్, 04 మే (హి.స.)తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఇంజినీరింగ్ పూర్తయిందంటే చాలు.. అమెరికా విమానం ఎక్కడమో లేదా బెంగళూరు, హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగంలో చేరడమో లక్ష్యంగా ఉండేది. కానీ ఏఐ యుగంలో ఐటీ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఐటీ దిగ్గజాలు కూడా ఖర్చుల కోత పేరుతో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుంటే.. ఆ నిరాశ మధ్య యువత ‘నైపుణ్యాల’ పెంపుతో సరికొత్త ఉపాధి మార్గాలను వెతుక్కుంటోంది. మార్కెట్ అవసరాలను గుర్తించి స్వయం ఉపాధి దిశగానూ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం కంపెనీలు డిగ్రీ పట్టా కంటే ‘స్కిల్ (నైపుణ్యం)’కే ప్రాధాన్యత ఇస్తున్నాయి. రాబోయే కాలంలో ఏ రంగంలోనైనా ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారికి స్థానం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొత్త సాంకేతికతలు, మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవడం ముఖ్యమని విద్యావేత్త మెండెం కిరణ్కుమార్ తెలిపారు.

ఐటీ ఉద్యోగాలు పోవడమంటే.. అవకాశాలు పోవడం కాదని, అవి రూపాంతరం చెందుతున్నాయని గుర్తించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సేవా రంగంలో (సర్వీస్ సెక్టార్) ఉన్న అవకాశాలు సామాన్యమైనవి కావని.. సమాజ అవసరాలను గుర్తించి దానికి తగ్గట్లు నైపుణాన్ని పెంచుకుంటే ప్రతి రంగం ఒక బంగారు గని వంటిదేనని పేర్కొన్నారు.

ఐటీ రంగంలో మనుగడ సాగించాలంటే ఇప్పుడు డిగ్రీ ఉంటే చాలదు. కేవలం జావా లేదా పైథాన్ నేర్చుకుంటే ఉద్యోగం వచ్చే రోజులు పోయాయి. ఇప్పుడు మార్కెట్ కోరుకుంటున్న సరికొత్త కోర్సుల్లో నైపుణ్యాలు తప్పనిసరి అయ్యాయి. ఇది గ్రహించిన యువత సంబంధిత కోర్సుల్లో ఆసక్తి చూపుతున్నారు.

కృత్రిమ మేధ (ఏఐ), డేటా సైన్స్

సాఫ్ట్వేర్ రంగం లో ఉన్నా సరే ఏఐ నైపుణ్యం లేకపోతే మనుగడ కష్టమని తేలిపోయింది. సాధారణ ప్రోగ్రామింగ్ స్థానంలో ఏఐ అప్లికేషన్ల తయారీకి డిమాండ్ పెరిగింది. 2026చివరికి దేశానికి 10 లక్షల మంది ఏఐ నిపుణులు అవసరమని అంచనా.

సెమీకండక్టర్ ఇంజినీరింగ్

భారత్ ఇప్పుడు గ్లోబల్ చిప్హబ్గా మారుతోంది. చిప్ తయారీ యూనిట్లు భారీగా వస్తుండటంతో ఈ రంగంలో నిపుణుల కొరత నెలకొంది. ఇందులో నైపుణ్యం ఉన్నవారికి లక్షల్లో జీతాలు లభిస్తున్నాయి.

సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్

డిజిటల్ లావాదేవీలు, నేరాలు పెరుగుతుండటంతో బ్యాంకింగ్, రక్షణ కవచంలా నిలిచే సైబర్ నిపుణులకు భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి.

పునరుత్పాదక ఇంధన కోర్సులు

పెట్రోల్ ఇంజన్ల కాలం పోతోంది. గ్రీన్ ఎనర్జీ, సోలార్, విండ్ పవర్ రంగాల్లో ఇంజనీర్లకు డిమాండ్ పెరిగింది. పర్యావరణ పరిరక్షణ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈవీ బ్యాటరీ మేనేజ్మెంట్, ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ ఇంజనీరింగ్కు డిమాండ్ పెరిగింది. సోలార్, విండ్ పవర్, ఎలక్ట్ర్టిక్ వెహికిల్ (ఈవీ) టెక్నాలజీ భవిష్యత్తును శాసించనున్నాయి.

బయో- టెక్నాలజీ అండ్ హెల్త్కేర్ డేటా

కోవిడ్ తర్వాత హెల్త్ కేర్ మేనేజ్మెంట్, బయో ఇన్మర్మేటిక్స్ కోర్సుల్లో చేరేవారి సంఖ్య 25శాతం పెరిగింది.

మార్కెట్లో ఉపాధికి కొత్త మార్గాలెన్నో..

ప్రస్తుతం సమాజంలో ప్రజలు విలాసానికి, ఆరోగ్యానికి, అందానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు నిరుద్యోగులకు కల్పవృక్షంగా మారింది. ఐటీ కొలువు పోయినవారు, ఉద్యోగం దొరకనివారు ఇప్పుడు సర్వీస్ సెక్టార్లో రాణిస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande