
సంగారెడ్డి, 04 మే (హి.స.)సీఎం రేవంత్రెడ్డి సర్కార్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే మన్నే క్రిశాంక్ని అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని ధ్వజమెత్తారు. ఆయనపై 35 కేసులు పెట్టి సీఎం రేవంత్రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహించారు. బీఆర్ఎస్, సోషల్ మీడియాపై పెట్టిన శ్రద్ధలో ఒక్క పైసా అయిన.. సీఎం శాంతిభద్రతలపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు.
ఈరోజు (సోమవారం) కందిలోని సంగారెడ్డి సెంట్రల్ జైలుకు కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేరుకున్నారు. జైల్లో ఉన్న మన్నే క్రిశాంక్తో వారు ములాఖత్ అయ్యారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కేపీ వివేకానంద్, పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. నిన్న(ఆదివారం) కరీంనగర్లో పట్టపగలు జ్యువెలరీ షాపులో దాడి జరిగిందని తెలిపారు. సీఎం రేవంత్కు పరువు, సిగ్గు అనేవి లేవని విమర్శించారు. తమ నేతలపై పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రైవేటు ఆర్మీలా పని చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు, జర్నలిస్టుల ఫోన్లను పోలీసులు హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. తాము ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలుసుకుంటున్నారన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టాలని కేటీఆర్ కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్