
విశాఖ, 04 మే (హి.స.)
, విశాఖలో ఓ పాత దుకాణం స్లాబ్ కుప్పకూలి ఒకరు దుర్మరణం చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన విశాఖ నగరం గాజువాకలోని వికాస్నగర్లో ఆదివారం సాయంత్రం జరిగింది. దీనికి సంబంధించి న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికాస్నగర్లో కె.అనిల్కుమార్కు రోడ్డు ముందు ఇల్లు, పాత దుకాణం ఉన్నాయి. ఆ దుకాణంలో ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నారు. ఇటీవల రహదారి విస్తరణలో భాగంగా ఫుట్పాత్ నిర్మించగా ఈ దుకాణం కాస్త కిందకు ఉండిపోయింది. దీన్ని జాకీల సాయంతో పైకి లేపడానికి నగరానికి చెందిన ఓ గుత్తేదారుతో రూ.1.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆదివారం ఉదయం 12 జాకీలతో పిల్లర్స్ కింద నుంచి పైకి లేపారు. సాయంత్రానికి పని పూర్తయిందని అంతా చేతులు కడుక్కోవడానికి పక్కకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా స్లాబ్ మధ్యకు విరిగి కుప్పకూలింది. దినసరి కూలీ నాగేశ్వరరావు అలియాస్ నాగు (34) స్లాబ్ కింద నలిగిపోయి మృతిచెందగా.. కూలీలు నారాయణరావు, రాజులు, సత్యనారాయణ, గుత్తేదారు ప్రసాద్లు పరుగు తీసి తప్పించుకున్నారు. అయితే వీరికి కూడా స్వల్పగాయాలయ్యాయి. రాత్రి 9.30 గంటల వరకూ కూడా భవన శిథిలాల తొలగింపు కొనసాగింది. శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. స్లాబ్ బలంగా లేకపోవడం, జాకీలు అమర్చే క్రమంలో కనీస నిబంధనలు పాటించకపోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు చెబుతున్నారు. మృతిచెందిన వ్యక్తి శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కుసుంపురం వాసిగా గుర్తించారు. గాజువాకలో అద్దెకుంటూ దినసరి కూలీ పనులకు వెళ్తుంటారు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ