'ఆ బాధ్యత తల్లిదండ్రులదే'.. జిల్లా ఎస్పీ జానకి కీలక సూచనలు
'ఆ బాధ్యత తల్లిదండ్రులదే'.. జిల్లా ఎస్పీ జానకి కీలక సూచనలు
SP


మహబూబ్నగర్, 26 జూన్ (హి.స.)

యువత డ్రగ్స్ కు బానిసలై తమ జీవితాన్ని కోల్పోతున్నారని వాటిని అరికట్టడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని, తమ పిల్లలు చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులదేనని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి అన్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జడ్చర్ల పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాక్తేథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలో డిగ్రీ కళాశాల మినీ స్టేడియం నుంచి ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జానకి ప్రారంభించి అనంతరం పట్టణంలో ర్యాలీ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం డిగ్రీ కళాశాల మినీ స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఎస్పీ జానకి మాట్లాడారు.

జిల్లాలో ఇటీవల కాలంలో యువత డ్రగ్స్కు అలవాటు పడి తమ జీవితాలను కోల్పోతున్నారని తెలిపారు. జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నందువల్ల గంజాయి వాడకం జరుగుతుందని గంజాయిని విక్రయిస్తున్న వారిపై ఇటీవల కేసులు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం తల్లిదండ్రులతో పాటు సమాజానికి కూడా ఎంతో అవసరం ఉందని అందుకోసమే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande