
అమరావతి, 27 జూన్ (హి.స.)
ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పదోన్నతుల అంశం వివాదంగా మారింది. కమిషనరేట్ ఉద్యోగులు, క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారుల మధ్య తలెత్తిన వివాదం పదోన్నతుల ప్రక్రియకు బ్రేక్ వేసింది. సీఐ నుంచి ఏఈఎస్ పోస్టులకు 16 మందికి పదోన్నతులు కల్పించేందుకు గురువారం డీపీసీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ సీఐలకు మాత్రమే ఏఈఎ్సలుగా పదోన్నతులు ఇస్తున్నారు. అయితే తమకూ పదోన్నతులు ఇవ్వాలని కమిషనరేట్లోని ఇద్దరు ఆఫీస్ సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగులు అడ్డం తిరిగారు. కమిషనర్ అనుమతి లేకుండానే వారే ఫైలులో పేర్లు రాసేసుకున్నారు. ఈ ఘటన తీవ్ర వివాదంగా మారింది.
నిబంధనల ప్రకారం కమిషనరేట్ ఉద్యోగులకు పదోన్నతుల కోటా ఉందని, ఆ కోటాలో తమకూ ఏఈఎ్సగా అవకాశం ఇవ్వాలని వారు కోరారు. అయితే తన అనుమతి లేకుండా ఫైలులో పేర్లు ఎలా పెడతారని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కమిషనరేట్ ఉద్యోగులకు క్షేత్రస్థాయి ఉద్యోగాల పదోన్నతుల విషయంలో నిషేధం ఉందని సీఐలు అంటున్నారు. ఈ వివాదం నేపథ్యంలో పదోన్నతుల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ