రాష్ట్ర.వ్యాప్తంగా 25 దొంగతనాలు.చేసి రెండేళ్లుగా తప్పించుకు.తిరుగుతున్న అంతరాష్ట్ర దొంగ అరెస్ట్
రాష్ట్ర.వ్యాప్తంగా 25 దొంగతనాలు.చేసి రెండేళ్లుగా తప్పించుకు.తిరుగుతున్న అంతరాష్ట్ర దొంగ అరెస్ట్
theft


వినుకొండ, 27 జూన్ (హి.స.)రాష్ట్రవ్యాప్తంగా 25 దొంగతనాలకు పాల్పడి రెండేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగను పల్నాడు జిల్లా వినుకొండ పోలీసులు అరెస్టు చేశారు. వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం నరసరావుపేట డీఎస్పీ ఎం.హనుమంతరావు నిందితుడి వివరాలు వెల్లడించారు. వినుకొండ మండలం దొండపాడుకు చెందిన షేక్ రఫీ ఎలియాస్ పొట్టి రఫీ (45) 20 ఏళ్లుగా దొంగతనాలే వృత్తిగా జీవనం సాగిస్తున్నాడు. పల్నాడు, గుంటూరు, ప్రకాశం, మార్కాపురం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. చోరీలకు అనువుగా ఉండే ఇళ్లపై పగటిపూట రెక్కీ నిర్వహించి, రాత్రిళ్లు గోడలకు జాకీతో రంధ్రాలు వేసి లోపలికి ప్రవేశించి దొంగతనం చేసేవాడు. ఇటీవల మార్కాపురం జిల్లా కంభం పట్టణానికి నివాసం మార్చాడు.

మే 21న వినుకొండలోని వేక్షిత జ్యువెలర్స్ షాపులో ఏడు కిలోల వెండి వస్తువులను అపహరించాడు. దుకాణ యజమాని వజ్రాల వీరేంద్ర రాహుల్రెడ్డి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్ఫోన్ కాల్డేటా ఆధారంగా నిందితుడి కదలికలను గుర్తించారు. వినుకొండలోని పసుపులేరు వంతెన వద్ద గురువారం అదుపులోకి తీసుకుని విచారించారు. వినుకొండలో జ్యువెలరీ షాపుతో పాటు పెయింట్, డ్రైఫ్రూట్స్ దుకాణాలు, మరో రెండు చోట్ల దొంగతనం చేసినట్లు రఫీ ఒప్పుకొన్నాడు. వీటితో పాటు ప్రకాశం జిల్లా అద్దంకిలో రూ.లక్ష నగదు, బంగారం, ఆటో, బుల్లెట్, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కారు దొంగతనం చేసినట్లు అంగీకరించాడు.

వినుకొండ, అద్దంకిలో చోరీ చేసిన సామగ్రిని పోలీసులు స్వాధీనపరచుకున్నారు. వీటిలో ఆటో, బుల్లెట్, రూ.1.70 లక్షల నగదు, ఆరు గ్రాముల బంగారు ఆభరణాలు, 7.257 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. వీటి విలువ రూ.27 లక్షలు అని పోలీసులు వెల్లడించారు. గతంలో 16 చోట్ల దొంగతనాలకు పాల్పడగా కొన్నాళ్లు జైల్లో ఉండి బయటకొచ్చి మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడని తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన సీఐ ప్రభాకర్ను డీఎస్పీ అభినందించారు. సీఐకి సహకరించిన కానిస్టేబుళ్లు సునీల్బాబు, అశోక్బాబు, లక్ష్మణరావు, జయరాంకు నగదు బహుమతులు అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande