
హైదరాబాద్, 27 జూన్ (హి.స.)
కొందరు దళారులు ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకుని రూ.లక్షల్లో రుణం ఇప్పించారు.. వారే ఆ యజమానికి తెలియకుండా ఆ ఆస్తిని మరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఆపై ఆ ఆస్తిపై రూ.కోటికి పైగా బ్యాంకు రుణం పొందారు. బ్యాంకు నుంచి వస్తున్న నోటీసులు చూసి బావురుమన్న అసలు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దళారుల బాగోతం బయటపడింది. చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం... కొత్తపేట శ్రీనివాసకాలనీకి చెందిన మారోజు అంజయ్యచారి(80) ఆర్థిక ఇబ్బందులతో 2018లో వనస్థలిపురానికి చెందిన కాళహస్తి మధు పరమేశ్వర్(47), మేడ్చల్ సమీపంలోని గుండ్ల పోచంపల్లికి చెందిన వంగాల రవికిరణ్(45) స్థిరాస్తి వ్యాపారులను సంప్రదించాడు. వారు అతని ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలను తీసుకుని రూ.35లక్షలు రుణం ఇప్పించారు. రుణభద్రతకు అగ్రిమెంటు, ఎంఓయూ, ఏజీపీఏ పత్రాలపైనా సంతకాలు చేయించుకున్నారు. రుణం పూర్తిగా చెల్లించాక ఆస్తి తిరిగి అప్పగిస్తామని నమ్మించారు.
ఏజీపీఏను దుర్వినియోగం చేస్తూ అంజయ్యచారికి తెలియకుండానే అదే ఏడాది జులైలో వలవేటి దేవసేన పేరిట ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం 2021లో ఆ ఆస్తిని బ్యాంకు సిబిల్ చక్కగా ఉన్న అన్సారి సిరాజ్ అహ్మద్ పేరిట తిరిగి రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం ఆస్తిని ఓ బ్యాంకులో మార్టిగేజ్ చేయించి రూ.1.3 కోట్లు రుణాన్ని పొందారు. ఆ వచ్చిన డబ్బుల్లోంచే రెండేళ్లు బ్యాంకు కిస్తీలు చెల్లించారు. అనంతరం వాయిదాలు చెల్లించకపోవడంతో ఆ ఇంట్లో ఉంటున్న అంజయ్యచారికి నోటీసులు వచ్చాయి. ఇంటి యజమాని పేరు మరొకరిది ఉండటంతో గాబరాపడిన ఆయన మధు పరమేశ్వర్, రవికిరణ్లను అడిగితే.. సరైన సమాధానం ఇవ్వలేదు. అప్పటికే కొంతమొత్తం అప్పు తిరిగి చెల్లించిన అంజయ్యచారి వడ్డీ సహా పూర్తి రుణం చెల్లించేందుకు సిద్ధపడినా ఆస్తిపత్రాలు ఇప్పించకుండా నిందితులు దాటవేశారు.
బాధితుడడి ఫిర్యాదుతో చైతన్యపురి పోలీసులు కేసునమోదుచేశారు. మధుపరమేశ్వర్, రవి కిరణ్లను శుక్రవారం అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. ఆ నిందితులపై ఇలాంటి కేసులు ఆదిభట్ల, జవహర్నగర్, మీర్పేట, మేడిపల్లి ఠాణాల పరిధిలోనూ నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్