
కర్నూలు, 27 జూన్ (హి.స.)నాన్ వెజ్ ప్రియులకు చేదువార్త.చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో పాటు కోడి గుడ్ల ధరలు కూడా ఆమాంతం పెరిగాయి. అసలే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలతో పాటు కూరగాయల ధరలు పెరగ్గా.. సామాన్యుడికి అందుబాటులో ఉండే చికెన్, గుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి.
చికెన్, కోడి గుడ్డు ధరలు భారీగా పెరిగాయి. కిలో చికెన్ ఏకంగా రూ.300కి చేరుకుంది. కోళ్ల ఫామ్స్లో ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన ధరల వల్ల చికెన్ ముక్క లోపలికి పోవాలంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు ఇది పెద్ద భారంగా మారింది. గత కొద్ది వారాల్లోనే చికెన్ ధర రూ.50 మేర పెరిగింది. గతంలో రూ.250కే కేజీ బాయిలర్ చికెన్ లభించగా.. ఇప్పుడు ఏకంగా రూ.300కి చేరుకుంది. దీంతో పాటు కోడిగుడ్డు ధరలు కూడా పెరిగాయి. సామాన్యుడికి సరసమైన ధరల్లో ఉండే ఎగ్ ధరలు పెరగడం కూడా పెద్ద షాక్గా చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్డు ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.
ఇక కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో కిలో చికెన్ ధర రూ.298గా ఉండగా.. డ్రస్స్డ్ చికెన్ రూ.264గా ఉంది. ఇక ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.143, రిటైల్ లైవ్ బర్డ్ రూ.170 పలుకుతోంది. ఇక 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.90 పలుకుతున్నాయి.చిరుద్యోగులు, దినసరి కూలీలు, హాస్టల్ విద్యార్థులకు తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్ అందించే ఏకైక ఆధారం కోడిగుడ్డు. కానీ ఇప్పుడు రోజుకు నాలుగు గుడ్లు కొనాలన్నా ముప్పై రూపాయలు దాటిపోతోంది. ఒకవైపు కూరగాయల ధరలు మండిపోతుంటే.. ఇంకోవైపు గుడ్డు కూడా ఇలా హాట్ కేక్లా మారిపోవడంతో మధ్యతరగతి ఇళ్లల్లో బడ్జెట్ లెక్కలు తలకిందులవుతున్నాయి. పౌల్ట్రీ రంగాన్ని ప్రభుత్వం ఆదుకుని, ధరలను నియంత్రణలోకి తెస్తే తప్ప సామాన్యుడికి గుడ్డు గండం తప్పేలా లేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV