
హైదరాబాద్, 27 జూన్ (హి.స.)
పాస్పోర్ట్ను పౌరసత్వంతో ముడిపెడుతూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒవైసీ వ్యాఖ్యలు చట్టవిరుద్ధమని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణలో ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో వీరిద్దరి మధ్య చెలరేగిన మాటల యుద్ధం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.
తెలంగాణలో ఓటరు జాబితాల సవరణ ప్రక్రియపై స్పందిస్తూ.. తుది జాబితాలో పేర్లు లేని పక్షంలో సదరు వ్యక్తుల పౌరసత్వంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సందేహాలు తలెత్తే అవకాశం ఉందని, పాస్పోర్ట్ ఉన్నప్పటికీ ఇబ్బందులు ఎదురవుతాయని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పాస్పోర్ట్ అనేది పౌరసత్వానికి తిరుగులేని ఆధారమని విదేశాంగ శాఖ స్పష్టం చేయనప్పటికీ, అది భారత పౌరులకు మాత్రమే అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం జారీ చేసే అత్యంత కీలకమైన పత్రం అని ఆయన పేర్కొన్నారు.
బారిస్టర్ కోర్సు చదివిన ఒవైసీ, పౌరసత్వ చట్టం-1955, పాస్పోర్ట్ చట్టం-1967లను మరోసారి అధ్యయనం చేసి మాట్లాడాలని కిషన్ రెడ్డి సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో అనవసర ఆందోళనలను సృష్టించడం సరికాదని ఆయన హితవు పలికారు. ఈ తాజా వివాదం తెలంగాణ రాజకీయాల్లో పత్రాల పరిశీలన, ఓటరు జాబితా సవరణ, పౌరసత్వం వంటి సున్నితమైన అంశాలపై చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi