ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్డీ కోర్సులపై విదేశీయులు ఆసక్తి
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్డీ కోర్సులపై విదేశీయులు ఆసక్తి
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్డీ కోర్సులపై విదేశీయులు ఆసక్తి


హైదరాబాద్, 28 జూన్ (హి.స.)

-ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్డీ కోర్సులు చేసేందుకు విదేశీ విద్యార్థులు వస్తున్నారు. ఓయూలో అంతర్జాతీయ వ్యవహారాల కార్యాలయం అధికారుల ప్రత్యేక శ్రద్ధతో ఆస్ట్రేలియా, దక్షిణాఫిక్రాల విద్యార్థులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. వీరికోసం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు, డ్యూయల్ డిగ్రీ కోర్సులను త్వరలో ప్రారంభించనున్నారు.

ఉస్మానియా వర్సిటీలో చదివేందుకు ఆఫ్రికా సహా మొత్తం 80 దేశాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. ఇప్పటివరకు 15 వేల మంది విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 509 మంది వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారు. విద్యార్థులకు తార్నాకలో.. విద్యార్థినులకు యూనివర్సిటీ టెక్నాలజీ మహిళా వసతిగృహంలో వసతి కేటాయిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి విద్యార్థి స్టడీ ఇన్ ఇండియా (ఎస్ఐఐ) కార్యక్రమం కింద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.

ఉపకార వేతనాలు.. ఫెలోషిప్లు..

విదేశీ విద్యార్థులకు రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రెగ్యులర్ కోర్సుల్లో చేరిన వారికి కేంద్ర ప్రభుత్వం ఫెÆలోషిప్ అందిస్తుండగా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చేరిన వారు తమ విద్యా ఖర్చులను స్వయంగా భరించాలి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) ఫెలోషిప్ కింద ఉపకార వేతనాలు లభిస్తున్నాయి. నేపాల్ నుంచి వచ్చే విద్యార్థులకు ఇండో- నేపాల్ ఫెÆలోషిప్ వస్తుంది.

విదేశీ వర్సిటీలతో అవగాహన ఒప్పందాలు..

అంతర్జాతీయ విద్యా సహకారాన్ని అందుకునేందుకు ఓయూ అధికారులు 17 విదేశీ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియాతో నాలుగేళ్ల క్రితం విద్య, పరిశోధన పరస్పర సహకారం కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. మరింత మంది విదేశీ విద్యార్థులకు అవకాశాలు కల్పించేందుకు కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నామని అంతర్జాతీయ వ్యవహారాల కార్యాలయం సంచాలకులు ప్రొఫెసర్ బి.విజయ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande