అనంతగిరిలో రీల్స్ రచ్చ... ఉప్పల్ బాలుపై కేసు
అనంతగిరిలో రీల్స్ రచ్చ... ఉప్పల్ బాలుపై కేసు
arrest


హైదరాబాద్, 28 జూన్ (హి.స.)

సోషల్ మీడియా రీల్స్ కోసం ప్రమాదకర విన్యాసాలు చేసిన ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు చిక్కుల్లో పడ్డారు. వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి కొండల్లో, కదులుతున్న కారుపై స్టంట్స్ చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.

'హాయ్ గైస్... షాక్ అయ్యారా?' అనే డైలాగ్తో సుపరిచితుడైన ఉప్పల్ బాలు, అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న మహీంద్రా థార్ పైకెక్కి కేకలు వేస్తూ వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పర్యాటకులు, భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించడమే కాకుండా, ఇతరుల భద్రతను ప్రమాదంలో నెట్టేలా ప్రవర్తిస్తున్నారని వారు పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

అందిన ఫిర్యాదులపై స్పందించిన అధికారులు, ప్రజా శాంతికి భంగం కలిగించడం, అటవీ నిబంధనలు ఉల్లంఘన వంటి అభియోగాల కింద ఉప్పల్ బాలుపై కేసు నమోదు చేశారు.

ఈ వివాదంపై ఉప్పల్ బాలు స్పందిస్తూ బహిరంగ క్షమాపణలు కోరారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తనకు లేదని, వీడియో చిత్రీకరించే సమయంలో ఆ ప్రాంతం ఖాళీగా ఉందని వివరించారు. తన బంధువు కొత్త కారు కొనడంతో సరదాగా చేసిన పని వివాదాస్పదమైందని, తన ప్రవర్తన వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande