
అమరావతి , 28 జూన్ (హి.స.)రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతున్నారా లేక గూండాల రాజ్యాన్ని కొనసాగిస్తున్నారా? అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో పర్యటిస్తున్న వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడులను చంద్రబాబే స్వయంగా ఉసిగొల్పారని ఆరోపిస్తూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన వరుస పోస్టులు చేశారు.
రాజధాని ప్రాంత రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న తమ పార్టీ నేతలపై దాడి చేయించడం ద్వారా పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హననం చేశారని జగన్ మండిపడ్డారు. కొందరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని సమన్వయం చేయడం అత్యంత దారుణమని విమర్శించారు. అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి, రైతులపై సాగుతున్న దౌర్జన్యాలు బయటపడకుండా ఉండేందుకే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi