
అమరావతి , 28 జూన్ (హి.స.)ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ కిచెన్ల వ్యవహారంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఎవరి ఉపాధి పోదని, పైగా కొత్త ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు. పేద విద్యార్థులకు రుచి, శుచితో కూడిన నాణ్యమైన భోజనం అందిస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు.
ఉపాధి కల్పనపై మాట్లాడుతూ.. వైఎస్సార్ కడప జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఐదు స్మార్ట్ కిచెన్లు ప్రారంభించాం. వాటి పరిధిలోని 233 మంది కుక్-కమ్-హెల్పర్లు యథావిధిగా తమ విధుల్లో కొనసాగుతున్నారు. త్వరలో జిల్లాలో ఏర్పాటు చేయబోయే మరో 33 స్మార్ట్ కిచెన్ల వల్ల కూడా ఏ ఒక్కరి ఉపాధికీ నష్టం వాటిల్లదు. పైగా, ఈ కిచెన్ల నిర్వహణ ద్వారా స్వయంశక్తి సంఘాల మహిళలకు అదనంగా 38 మంది హెడ్ కుక్స్, 22 మంది అసిస్టెంట్ కుక్స్, 256 మంది హెల్పర్లు, సుమారు 76 మంది డ్రైవర్లకు ఉపాధి లభించబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందికి అదనపు ఉపాధి కల్పిస్తుంటే జగన్ ఎందుకు ఏడుస్తున్నారు? పేదలు బాగుపడటం ఆయనకు ఇష్టం లేదా? అని లోకేశ్ ప్రశ్నించారు.
వేతనాల బకాయిల ఆరోపణలను కూడా లోకేశ్ తోసిపుచ్చారు. కడప జిల్లాలోని 3,450 మంది కుక్-కమ్-హెల్పర్లకు 2026 ఏప్రిల్ నెల వరకు జీతాలు పూర్తిగా చెల్లించాం. మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో గౌరవ వేతనం చెల్లింపు ఉండదు. జూన్ నెల ఇంకా పూర్తి కాలేదు. మరి జగన్ ఎవరి బకాయిల గురించి ఫేక్ ఆరోపణలు చేశారో చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi