
హైదరాబాద్, 28 జూన్ (హి.స.)హనుమకొండ జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామం సమీపంలో వేగంగా వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి తొలుత డివైడర్ను ఢీకొట్టి, అనంతరం రోడ్డు పక్కనే ఉన్న ఒక ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్కు చెందిన కళ్లెం శ్రీనివాస్గా గుర్తించారు. ఉప్పల్ గ్రామంలో తన స్నేహితుడిని దింపి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi