ఆర్థిక నేరాలకు అడ్డాగా మారుతున్న కళ్యాణదుర్గం..
ఆర్థిక నేరాలకు అడ్డాగా మారుతున్న కళ్యాణదుర్గం..
కళ్యాణదుర్గం


కళ్యాణదుర్గం, 28 జూన్ (హి.స.)అనంతపురం జిల్లాలో వెనుకబడిన, కరువు ప్రభావిత ప్రాంతంగా పేరుగాంచిన కళ్యాణదుర్గం ఇటీవల కాలంలో వెలుగుచూస్తున్న ఆర్థిక నేరాలు, అక్రమాల కారణంగా మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. ఒకప్పుడు ప్రశాంతతకు ప్రతీకగా భావించిన ఈ ప్రాంతం పేరు వరుస ఆర్థిక అక్రమాల కారణంగా ప్రతికూల ప్రచారంలో నిలుస్తోందనే అభిప్రాయాలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ స్టాంపుల వ్యవహారం కళ్యాణదుర్గం కేంద్రంగా సాగినట్లు విచారణలో బయటపడిన విషయం తెలిసిందే. కంప్యూటర్ సాఫ్ట్వేర్ సహాయంతో స్టాంపులలో అంకెల మార్పులు చేసి నకిలీ పత్రాలు తయారు చేసిన ఘటన అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆ ఘటన మరవకముందే, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన బ్యాంకు ఖాతాలో భారీ విదేశీ నిధులు ఉన్నట్లు చూపిస్తూ నకిలీ బ్యాంకు పత్రాలు, రబ్బర్ స్టాంపులు, రిజర్వ్ బ్యాంక్ లేఖలను తయారు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.

అలాగే, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు కూడా రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు కూడా ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగి లక్షల్లో లంచం స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వివిధ శాఖల పనితీరుపై మరింత పర్యవేక్షణ అవసరమని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలు, అక్రమ ఆర్థిక లావాదేవీలపై సంబంధిత శాఖలు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande