
అమరావతి, 29 జూన్ (హి.స.)
తగరపువలస, భీమునిపట్నం, బంగారం కోసం బంధాలు పక్కన పెట్టి చోరీకి పాల్పడిన ఇంటి దొంగను భీమిలి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను నార్త్ క్రైం ఏసీపీ వెంకటరావు భీమిలి క్రైం పోలీసుస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. భీమిలి మండలం సింగనబంద గ్రామంలోని బంధువుల పెళ్లికి విజయవాడకు చెందిన మద్దిల కనక (47) తన అక్క కాళ్ల సన్యాసమ్మ, మరదలు లక్ష్మితో కలిసి వచ్చారు. 26వ తేదీ శుక్రవారం వివాహం జరిగిన తర్వాత అదే గ్రామంలో ఉంటున్న తన పిన్ని బోని పైడమ్మకు అనారోగ్యంగా ఉండడంతో ఆమెను పరామర్శించి ఆ రాత్రి అక్కడే పడుకుని మరుసటి రోజు విజయవాడకు వెళ్లాలి అనుకున్నారు.
పడుకునే ముందు కనక తన మూడుం పావు తులాల బంగారు పుస్తెలతాడును మెడలో నుంచి తీసి తలగడ కింద పెట్టారు. అర్ధరాత్రి సమయంలో తన పిన్నికుమార్తె కాళ్ల నాగమల్లేశ్వరి (34) పెద్దగా కేకలు వేస్తూ తాను బహిర్భూమికి రాగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన చెవిలోని పావుతులం బంగారం దిద్దులు లాక్కుని పోయారంటూ హడావుడి చేసింది. నిద్ర నుంచి లేచిన కనక తాను తలగడ కింద ఉంచిన పుస్తెల తాడు కూడా లేకపోవడంతో వెంటనే డయల్ 112 ద్వారా ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న భీమిలి క్రైం ఎస్ఐ ఆర్.శ్రీనివాసరావు హుటాహుటిన సిబ్బందితో అక్కడికి చేరుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలు, సెల్టవర్ ఫోన్ సిగ్నల్స్, తదితర కోణాల్లో డేటాను విశ్లేషించి, లోతుగా విచారించగా నాగమల్లేశ్వరి బంగారు పుస్తెలతాడును దొంగిలించి డ్రామా ఆడుతున్నట్లు నిర్ధారించారు. ఇదే విషయాన్ని నిందితురాలు కూడా గ్రామ పెద్దలు, పోలీసుల సమక్షంలో ఒప్పుకోవడంతో ఆమెను అరెస్టు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ