
సంగం, 29 జూన్ (హి.స.), : పీఎం సూర్యఘర్ పథకాన్ని జిల్లా వాసులు అందిపుచ్చుకుంటున్నారు. దీని కింద జిల్లాలో 7,060 మంది కనెక్షన్లు ఏర్పాటు చేసుకున్నారు. వీటి ద్వారా నెలకు 25.3 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోంది. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ పరిధిలో జిల్లా అగ్రస్థానంలో ఉండటం విశేషం. జిల్లాలో 9 లక్షల గృహ విద్యుత్తు కనెక్షన్లతో పాటు ఇతర కేటగిరిలను కలిపితే దాదాపు 13 లక్షలుంటాయి. వీటి ద్వారా సాధారణ రోజుల్లో నెలకు 9.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతోంది. అదే వేసవిలో 14.5 మిలియన్లు దాటుతుంది.
ఇంధన వనరుల్లో సౌరశక్తిని ప్రత్యామ్నాయ విద్యుత్తుగా మార్చుకుంటే వినియోగదారులు, సరఫరాదారులకు ఆర్థికభారం తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ పథకానికి శ్రీకారం చుట్టింది. దీనికింద కనెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే రాయితీ అందిస్తోంది. జిల్లాలో 25వేల విద్యుత్తు కనెక్షన్లు సౌరవిద్యుత్తుకు మార్చాలనే లక్ష్యంతో డిస్కం చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. కేంద్రం నుంచి రెండు కిలోవాట్ల వరకు (కిలోవాట్కు రూ.30 వేల చొప్పున) రూ.60 వేలు, మూడు కిలోవాట్ల నుంచి ఆపైన గరిష్ఠంగా రూ.78 వేలు రాయితీ లభిస్తోంది. రాయితీ వేగంగా మంజూరవుతుండటంతో వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. కనెక్షన్లు ఏర్పాటు చేసుకునే వారికి బ్యాంకర్లు రుణాలు ఇస్తుండటంతో ప్రక్రియ వేగంగా సాగుతోంది. జిల్లాలో సౌరవిద్యుత్తు కోసం 13,521 మంది నమోదు చేసుకోగా, 7,060 మంది సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు. వారికి మూడు నుంచి ఏడురోజుల్లోపు కేంద్రం రాయితీ నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే 6,469 మందికి నగదు జమైంది. మిగిలిన వారికి త్వరలో అందనుంది.
ప్రతినెలా విద్యుత్తు బిల్లులకు చెల్లించాల్సిన నగదుని బ్యాంకులో జమ చేస్తే అయిదేళ్లలో రుణం పూర్తవుతుంది. 15ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్తు పొందేలా సౌరఫలకలు సామర్థ్యం కలిగి ఉంటాయి. జిల్లాలో ఏర్పాటవుతున్న సోలార్ యూనిట్ల ద్వారా ప్రస్తుతం నెలకు 25.3 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. వినియోగదారులు ఉపయోగించుకోగా మిగిలిన దాన్ని డిస్కం యూనిట్కు రూ.2.09 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఉత్పత్తిదారులకు ఆరునెలలకు ఒకసారి చెల్లింపులు చేస్తోంది.
గతంలో ప్రతినెలా విద్యుత్తు బిల్లు రూ.3వేలు వస్తుండేది. మూడు నెలల క్రితం సౌరవిద్యుత్తు ఏర్పాటు చేసుకోవడంతో ప్రస్తుతం సున్నాబిల్లు వస్తుంది. కేంద్ర ప్రభుత్వ రాయితీ నగదు కూడా వెంటనే ఖాతాలో జమైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ