
ఖమ్మం, 29 జూన్ (హి.స.)
బీఆర్ఎస్ పాలకులు ఆర్థిక,సామాజిక దోపిడీకి పాల్పడి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాలన తమ కుటుంబం కోసం, తమ నలుగురి కోసం అన్నట్లుగా పదేళ్లు చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సంపదను నలుగురు కుటుంబ సభ్యులు దోచుకొని, ఆ డబ్బుతో నాలుగు చానళ్లు, పత్రికలు, సోషల్ మీడియా ద్వారా అబద్ధాలు పోగేసి ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వారు ఖమ్మం జిల్లా ఎరుపాలెం లో మీడియాతో మాట్లాడారు.
ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం మానవ సేవే మాధవ సేవ అనే మన సంస్కృతి విలువలతో ముందుకు సాగుతోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అవసరాలు తీర్చడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిలబెట్టగలమని భారత రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ఇదే లక్ష్యంతో ముందుకు వెళ్తాందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పై ఉపముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆనాటి ప్రభుత్వంలో ఒకరిద్దరు వ్యక్తులు రాష్ట్ర వనరులన్నింటినీ కొల్లగొట్టి, దోపిడీ చేశారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. నాలుగు కోట్ల ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి, కేవలం నలుగురి సంక్షేమం, అభివృద్ధి కోసమే ఆనాడు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారని విమర్శించారు.
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పగిస్తే, ఆ నిధులన్నింటినీ కరిగించి మరో రూ. 8 లక్షల కోట్ల అప్పులను మిగిల్చారని డిప్యూటీ సీఎం ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం నిరుపేదల, మధ్యతరగతి కుటుంబాల అవసరాలను గుర్తిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని భట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను తమ ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇందుకోసం రూ. 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రజా ప్రభుత్వం చేపట్టిందని అన్నారు.
రాష్ట్ర మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. మహిళలు తీసుకునే టికెట్లకు సంబంధించిన నగదును ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తోందన్నారు. ఇప్పటివరకు దాదాపు రూ. 10,600 కోట్లను ఈ పథకం కింద ఆర్టీసీకి ఆర్థిక శాఖ చెల్లించడం జరిగిందన్నారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా రూ. 20,000 కోట్ల రుణాలు అందిస్తూ, ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలను ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గతంలో ఉన్న రూ. 5 లక్షల సీలింగ్ను రూ.10 లక్షలకు పెంచారన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఆరోగ్యశ్రీ అస్తవ్యస్తంగా మారి పేదలు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని, దానిని మారుస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెంచిందని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచడం జరిగిందని తెలిపారు. అత్యంత మానవీయ కోణంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 20 లక్షల మంది విద్యార్థులకు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని 7 లక్షల మంది విద్యార్థులకు, మొత్తంగా 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయపు ఉచిత అల్పాహార (బ్రేక్ఫాస్ట్) పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. వారంలో ఆరు రోజులు అల్పాహారంతో పాటు ఒక రోజు పాలు, ఒక రోజు రాగిజావ అందిస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం రూ. 2,216 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి, అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క-సారలమ్మ వంటి దేవాలయాలను వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ, ప్రజల మనోభావాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రూప్-1 పరీక్ష కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసిందని తెలిపారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడమే కాకుండా, దాదాపు 76,000 మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించామని ఆయన గుర్తుచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..