
అమరావతి, 30 జూన్ (హి.స.)
చిత్తూరు జిల్లాలో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. గంగవరం మండలం బండమీద జరావారిపల్లెలో బాలిక శిరీష ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే తమ బిడ్డను హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాలికకు తీవ్ర జ్వరం రావడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. సాయంత్రం ఇంటికి వచ్చి చూసిన తల్లిదండ్రులకు ఆమె ఉరివేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
తమ బిడ్డది ఆత్మహత్య కాదని, హత్య అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని ఓ యువకుడితో చనువుగా మాట్లాడటం చూసి శిరీషకు యువకుడి తండ్రి నాగరాజు వార్నింగ్ ఇచ్చినట్లు వారు చెబుతున్నారు. తన కూతురి మృతికి నాగరాజే కారణమని ఆరోపించారు. ప్రస్తుతం నాగరాజు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు అనుమానస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ