
న్యూఢిల్లీ, 30 జూన్ (హి.స.)
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) చేసిన వ్యాఖ్యలపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్రావు (BJP MP Raghunandan Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను పూర్తిగా తిప్పికొట్టారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సరిపడా యూరియా కోటాను క్రమం తప్పకుండా పంపిస్తోందని, కానీ క్షేత్రస్థాయిలో రైతులకు దానిని సక్రమంగా పంపిణీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. గతంలో ఢిల్లీలో ధర్నా చేసిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నారో అందరికీ తెలుసని, రేపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎక్కడికి చేరుతుందో వేచి చూడాలంటూ ఎద్దేవా చేశారు.
మా అధ్యక్షుడు పరిగెత్తే యువకుడు..
కాంగ్రెస్ నాయకత్వంపై రఘునందన్రావు వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడ్డారు. తమ పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు నిరంతరం ప్రజల్లో ఉంటూ పరిగెత్తే యువ నాయకుడని కొనియాడారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒకసారి కూర్చుంటే కనీసం లేవలేని స్థితిలో ఉన్నారు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే బీజేపీ ఏకైక లక్ష్యమని, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని రఘునందన్రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..