
జోగులాంబ గద్వాల, 30 జూన్ (హి.స.)
విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకునేలా చదవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం గద్వాలలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పదవ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ... ఎస్ఎస్సి ప్రతి విద్యార్థికి కీలక దశ అని, ప్రస్తుతం బాగా చదివితేనే తమ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకోవచ్చన్నారు. విద్యార్థులు వెనుకబడ్డ సబ్జెక్టుల్లో ప్రత్యేక దృష్టి సారించి సాధన చేసేలా ఉపాధ్యాయులు బోధించాలని ఆదేశించారు. గతేడాది పదవ తరగతి విద్యార్థులు సాధించిన మార్కుల కంటే ప్రస్తుత విద్యార్థులు ఇంకా ఎక్కువగా సాధించాలని ఆకాంక్షించారు. ఇటీవల జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేకంగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎవరైనా సెలవు పెడితే ఒకటి, రెండు రోజులు ముందుగానే సంబంధిత ఉన్నతాధికారులకు సెలవు చీటీ ఇవ్వాలని చెప్పినప్పటికీ పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయుడు మంగళవారం ఉదయం వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు మెమో జారీ చేయాలని జిహెచ్ఎం రేణుకా దేవిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ తో పాటు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రిజిస్టర్ ను పరిశీలించారు. ఫుడ్ కమిటీ సభ్యులుగా ఉన్న విద్యార్థులు క్రమం తప్పకుండా ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని, అందుకు అనుగుణంగా భోజనాన్ని వండించాలని ఆదేశించారు. పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడు యూ డైఎస్ లో నమోదు చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..