కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల సరఫరా పై బీజేపీ ఎంపీలు ఒత్తిడి తేవాలి. మంత్రి పొన్నం
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల సరఫరా పై బీజేపీ ఎంపీలు ఒత్తిడి తేవాలి. మంత్రి పొన్నం
పొన్నం


సిద్దిపేట, 30 జూన్ (హి.స.)

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు

కల్పించడమే ప్రజాస్వామ్యానికి అసలైన పునాది అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 17, 18వ వార్డుల్లో మంగళవారం ఆయన పర్యటించారు. అక్కడ కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(SIR) ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఇంటింటికీ వెళ్తున్న బీఎలీలు, బీఎల్ఎలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం నేటి నుంచే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను విడుదల చేస్తుందని ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఓట్ల కోసమే రైతుబంధు పేరిట ఎస్ఎంఎస్ ల హడావుడి చేసిందని, నిధుల విడుదలకు నెలల తరబడి సమయం తీసుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 30 నెలల్లోనే రూ.27వేల కోట్లను రైతులకు అందించిందని గుర్తుచేశారు. గతంలో 9 రోజుల్లోనే నిధులు వేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈసారి కూడా అంతే వేగంగా పంపిణీ పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రైతులకు సన్న వడ్ల బోనస్, ఆధునిక పనిముట్లు ఇస్తున్నామని, ధాన్యం కొనుగోళ్లు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నామన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల సరఫరా పై బీజేపీ ఎంపీలు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో వ్యతిరేక ఓట్లను తొలగిస్తుందని ఆరోపించిన మంత్రి.. కాంగ్రెస్ శ్రేణులు, బీఎల్ఎలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande