
అమరావతి, 30 జూన్ (హి.స.)
రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియకు గడువు పొడిగించి, బీఎల్వోలపై పని ఒత్తిడి తగ్గించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జాని పాషా, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు కోరారు. ఈ మేరకు అమరావతి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ను కలిసి వినతిపత్రం సమర్పించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. సర్ ప్రక్రియలో బీఎల్వోలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఓటర్లు అందుబాటులో లేకపోవడం, పాత సర్ వివరాల ధ్రువీకరణలో సమస్యలు, ఓటర్లు అసంపూర్తిగా ఫారాలు నమోదు చేయడం వంటి కారణాలతో నిర్ణీత గడువులో ప్రక్రియ పూర్తిచేయడం కష్టసాధ్యమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియకు గడువు పొడిగించాలని, సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బీఎల్ఓలకు ఇతర అధికారిక పనులు అప్పగించకుండా చూడాలని సీఈవోను కోరినట్టు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ