ఏపీలో విద్యా సంస్కరణలు భేష్.. నారా లోకేశ్పై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసల వర్షం
ఏపీలో విద్యా సంస్కరణలు భేష్.. నారా లోకేశ్పై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసల వర్షం
Lokesh


భోగాపురం, 30 జూన్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ విద్యారంగం అభివృద్ధికి, నూతన విద్యావిధానాల అమలుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శ్రద్ధతో చేస్తున్న కృషి అభినందనీయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు లోకేశ్ చూపిస్తున్న చొరవను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. మంగళవారం విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ను మంత్రి నారా లోకేశ్తో కలిసి ధర్మేంద్ర ప్రధాన్ సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా పాఠశాలలో అమలు చేస్తున్న ఆధునిక విద్యాబోధన పద్ధతులు, మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు.

పాఠశాలకు చేరుకున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్కు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సి. పార్వతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. విద్యార్థులు, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మంత్రులు పాఠశాల ప్రాంగణమంతా కలియతిరిగారు.

టెక్నాలజీ, సంప్రదాయాల మేళవింపు

పర్యటనలో భాగంగా, విద్యాబోధనలో వినియోగిస్తున్న పలు ఆధునిక ఉపకరణాలను మంత్రులు పరిశీలించారు. ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం రూపొందించిన 'జాదూ పిఠారా' కిట్ను కేంద్ర మంత్రి ఆసక్తిగా గమనించగా, దాని పనితీరును మంత్రి లోకేశ్, సిబ్బంది వివరించారు.

విద్యార్థుల ప్రగతిని నమోదు చేసే ప్రోగ్రెస్ కార్డులు, అసెస్మెంట్ బుక్లెట్లను లోకేశ్ కేంద్ర మంత్రికి చూపించారు. విలువలతో కూడిన విద్య కోసం ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలతో ముద్రించిన పుస్తకాల గురించి వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న 'సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్'లోని టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫాం, షూ, స్కూల్ బ్యాగ్ వంటి వస్తువులను ప్రధాన్ పరిశీలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande