
తిరుమల, 30 జూన్ (హి.స.)కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 21 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి (ఉచిత దర్శనం) సుమారు 12 గంటల సమయం పడుతుండగా, టైమ్ స్లాట్ టోకెన్లు ఉన్న భక్తులకు 3 నుండి 4 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు టీటీడీ (TTD) సిబ్బంది నిరంతరాయంగా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలను అందిస్తూ పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు తిరుమలేశుడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. నిన్న ఒక్కరోజే మొత్తం 95,498 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారిలో 30,231 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి పునీతులయ్యారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.63 కోట్లుగా నమోదైనట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV