
అమరావతి, 01 జూలై (హి.స.)
ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌరవ న్యాయమూర్తి ఎదుట హాజరైన సస్పెండెడ్ సీఐ నాగరాజుసంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కేసును ఒప్పుకునేలా ఒత్తిడి తెస్తున్నారని, అకారణంగా ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ కేసులో తనను బలవంతంగా నిందితుడిగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. గతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నిర్వహించిన విచారణలో పూర్తిగా సహకరించానని, తన వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని ఇప్పటికే అధికారులకు అందించానని తెలిపారు. ప్రస్తుతం తన వద్ద అదనంగా చెప్పేందుకు ఎలాంటి సమాచారం లేదని నాగరాజు పేర్కొన్నారు
అంతేకాకుండా, కస్టడీలో తన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా నాగరాజు న్యాయమూర్తికి వివరించారు. ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించిన న్యాయమూర్తి, నాగరాజు చేసిన ఆరోపణలు, అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సమర్పించాలని పోలీసులను ఆదేశించారు.
మరోవైపు, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తును సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే నాగరాజును 12 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో కస్టడీ పిటిషన్పై న్యాయస్థానం తీసుకునే నిర్ణయం పై ఆసక్తి నెలకొంది.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ