
అమరావతి, 01 జూలై (హి.స.)
తెలంగాణ రాష్ట్రాల్లో అధిక లాభాల ఆశచూపి కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడిన జెనిసెస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సంస్థ మాయాజాలం కాకినాడలో కలకలం రేపుతోంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి భారీ రిటర్న్స్ ఇస్తామంటూ ఈ సంస్థ నమ్మించింది. దాదాపు రూ. 100 కోట్ల వరకు ఖాతాదారుల నుంచి వసూలు చేసింది. గత కొన్ని నెలలుగా చెల్లింపులు నిలిపివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. 'రూ. లక్ష పెట్టుబడితో నెల నెలా అసలు, వడ్డీతో కలిపి మొదటి 10 నెలలు రూ.15వేల చొప్పున, తర్వాత 20 నెలలు రూ.12,500 చొప్పున చెల్లిస్తాం. 30 నెలల్లో రూ.4 లక్షలు పొందండి' అంటూ ఈ సంస్థ ప్రచారం చేసింది. అలాగే పెట్టుబడులను స్టాక్ మార్కెట్లో పెట్టి అధిక లాభాలు సాధించి తమకు భారీ రాబడులు అందిస్తామని ఈ సంస్థ హామీ ఇచ్చిందని బాధితులు చెబుతున్నారు.
జెనిసెస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సంస్థ హామీలను నమ్మి పలువురు రూ.1 లక్ష నుంచి రూ.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సంస్థ చెల్లింపులు నిలిపివేసినట్లు బాధితులు తెలిపారు. నెలవారీ చెల్లింపులు రావడం ఆగిపోవడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. తమ డబ్బులు తిరిగి వస్తాయో లేదోనన్న భయంతో పలువురు ఖాతాదారులు కాకినాడలోని కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ