
ఏలూరు జిల్లా, :, 01 జూలై (హి.స.)
ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. వేలేరుపాడు మండలంలోని చింతలపాడు గ్రామ సమీపంలో ఈరోజు(బుధవారం) తెల్లవారుజామున ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామస్థులు అప్రమత్తమవగా, అటవీ శాఖ అధికారులు పులి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
పులికి రేడియో కాలర్ అమర్చి దాని కదలికలను ట్రాక్ చేస్తున్నారు. రేడియో కాలర్ ద్వారా అందుతున్న సంకేతాల ఆధారంగా పులి ప్రస్తుతం యడవల్లి అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పులి సంచారం ఉన్న ప్రాంతాలపై అటవీ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
చింతలపాడు గ్రామ సమీపంలో పులి ఆవుపై దాడి చేయడంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆయా గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతాలకు వెళ్లే వారు, పశువులను మేపేందుకు వెళ్లే రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ