
యాదాద్రి భువనగిరి, 01 జూలై (హి.స.)
ప్రతి మహిళకు 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 1,94,493 మంది స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఉన్నారని తెలిపారు. వారందరికీ దశలవారీగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మూడు నెలల వ్యవధిలో పూర్తి చేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం కింద ప్రతి మహిళకు 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇందులో రక్తంలో చక్కెర పరీక్ష, సీరం బిలిరుబిన్ (మొత్తం, డైరెక్ట్), సీరం క్రియాటినిన్, బ్లడ్ యూరియా, ఎసీపీటీ, ఎసీఓటీ, సీరం ఆల్కలైన్ ఫాస్ఫటేస్, సీరం టోటల్ ప్రోటీన్, సీరం ఆల్బుమిన్ & ఏ/జీ రేషియో వంటి 10 బయోకెమిస్ట్రీ పరీక్షలు, థైరాయిడ్ పనితీరును అంచనా వేసే టీఎన్హెచ్ పరీక్ష (నవజాత శిశువుల స్క్రీనింగ్తో సహా), హీమోగ్లోబిన్, మొత్తం తెల్ల రక్తకణాల సంఖ్య, డిఫరెన్షియల్ ల్యూకోసైట్ కౌంట్, ప్లేట్లెట్ కౌంట్, మొత్తం ఎర్ర రక్తకణాల సంఖ్య, హెమటోక్రిట్ (HCT), ఎంసీవీ (MCV) వంటి 7 హీమటాలజీ పరీక్షలు నిర్వహించనున్నారు. అదనంగా రక్త గ్రూప్, ఎత్తు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్ (BMI), రక్తపోటు, వైకల్య నిర్ధారణ, శరీర ఉష్ణోగ్రత, గుండె స్పందన రేటు, శ్వాస రేటు, కంటి పరీక్ష, నోటి పరీక్ష, చర్మం, గోళ్ల పరీక్ష వంటి 12 స్పోక్ స్థాయి ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ పరీక్షల ద్వారా మహిళల్లో వ్యాధులను ప్రారంభదశలోనే గుర్తించి తక్షణ చికిత్స అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లాలో అందుబాటులో ఉన్న ల్యాబ్ మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, మానవ వనరులు, రీ-ఏజెంట్లు, మెడికల్ ఎక్విప్మెంట్ ఇతర అవసరమైన సామగ్రిపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. అవసరమైన చోట ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను నిబంధనల ప్రకారం భర్తీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యుల ఆరోగ్య పరీక్షలు, నమూనాల సేకరణ, డేటా నమోదు, ఫాలోఅప్ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు మేప్మా, మున్సిపల్ శాఖ మరియు డీఆర్డీఏ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..