నేడు ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్మాతకోత్సవం - హాజరుకానున్న రాష్ట్రపతి
నేడు ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్మాతకోత్సవం - హాజరుకానున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి


అనంతపురం, 01 జూలై (హి.స.) ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్మాతకోత్సవానికి సిద్ధమైంది. రాష్ట్ర విభజన తర్వాత అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతులూరు వద్ద కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. తొలి స్నాతకోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి లోకేశ్ హాజరుకానున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు రానున్నారు.

2020లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అనంతపురం జిల్లా జంతులూరులో 500 ఎకరాల భూమిని కేటాయించింది. విశ్వవిద్యాలయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం రూ.711 కోట్లు మంజూరు చేసింది. అందులో తొలి దశ నిర్మాణ పనుల కోసం రూ.350 కోట్లు విడుదల చేసింది.

2023 మార్చిలో తొలి దశ నిర్మాణ పనులు ప్రారంభించి, 2025 మార్చి నాటికి పూర్తి చేసింది. ఉపకులపతి ఆచార్య S.A కోరి ఆధ్వర్యంలో తొలి స్నాతకోత్సవానికి సన్నాహాలు పూర్తి చేశారు. 2020 నుంచి 2026 విద్యా సంవత్సరం వరకు ఉత్తీర్ణులైన 12వందల 68 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేయనున్నారు. 23 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

5 కి.మీ మేర రెడ్జోన్, నో ఫ్లైయింగ్ జోన్ : అనంతపురం జిల్లా బుక్కరాయసమద్రం మండలంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నేపథ్యంలో రాష్ట్రపతి హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వద్దకు వచ్చే వరకూ అధికారులు కాన్వాయ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. కేంద్ర బలగాలు వర్సిటీ ప్రాంగణాన్ని ఇప్పటికే ఆధీనంలోకి తీసుకున్నాయని, వర్సిటీ చుట్టుపక్కల 5 కి.మీ మేర రెడ్జోన్, నో ఫ్లైయింగ్ జోన్గా ప్రకటించామని ఎస్పీ జగదీశ్ వివరించారు.

గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఘన స్వాగతం : ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు శ్రీసత్యసాయి విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం లభించింది. నిన్న(మంగళవారం) సాయంత్రం 6.10 గంటలకు ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్నారు. విమానాశ్రయంలో గవర్నర్కు కలెక్టర్ శ్యామ్ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఆర్డీవో సువర్ణ స్వాగతం పలికారు. నేడు(బుధవారం) ఉదయం 8:50 గంటలకు పుట్టపర్తిలో శ్రీనివాస గెస్ట్హౌస్ నుంచి గవర్నర్ రోడ్డు మార్గం ద్వారా 10:20 గంటలకు సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంటారు. 10:30కి హెలిప్యాడ్ వద్ద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్వాగతం పలుకుతారు. 11 నుంచి 12 వరకూ రాష్ట్రపతితో కలసి స్నాతకోత్సవంలో పాల్గొంటారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande