దేశవ్యాప్తంగా నేటి నుంచి వీబీ-జీ రామ్ జీ అమల్లోకి ...,,తిరుపతి నుంచే ప్రారంభోత్సవం
దేశవ్యాప్తంగా నేటి నుంచి వీబీ-జీ రామ్ జీ అమల్లోకి ...,,తిరుపతి నుంచే ప్రారంభోత్సవం
/vbk-g-ram-g-act-implemented-from-today-daily-wages-hike


తిరుపతి , 01 జూలై (హి.స.): భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం (జూలై 1, 2026) ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు చేయబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ నేటి నుంచి దేశవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ నూతన ఉపాధి హామీ పథకానికి సంబంధించి సవరించిన రోజువారీ కౌలు రేట్లను, కొత్త వేతనాల వివరాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ప్రకటించింది.

ఈ చట్టం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మార్చడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ధీమా వ్యక్తం చేసింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త కూలి రేట్లు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తాయి.

ఈ సరికొత్త చట్టం ప్రకారం గ్రామీణ కూలీలకు లభించే రోజువారీ వేతనాల్లో కేంద్రం భారీ మార్పులు చేసింది. గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద దేశవ్యాప్తంగా సగటున రోజుకు రూ.298.8గా ఉన్న వేతనాన్ని, ఇప్పుడు ఈ కొత్త చట్టం (VB-G RAM G) ద్వారా రూ.327.4కు పెంచారు.

ఈ కొత్త ఉపాధి హామీ చట్టం ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగడానికి, కూలీలకు సమయానికి వేతనాలు చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను ముందస్తుగానే కేటాయించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం ప్రాథమికంగా రూ.95,692.31 కోట్ల బడ్జెట్ నిధులను విడుదల చేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, దేశంలోని ఏ ఒక్క అర్హుడైన గ్రామీణ కార్మికుడు కూడా ఒక్క రోజు కూడా పని లేకుండా ఖాళీగా ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. పల్లెలు సమృద్ధిగా మారినప్పుడే వికసిత భారత్ కల సాకారమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చట్టం కింద కొత్తగా ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ కార్డులు జారీ చేసే వరకు, పాత ఈ-కేవైసీ పూర్తయిన జాబ్ కార్డులే చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుంచే ప్రారంభోత్సవం

ఈ సరికొత్త చట్టానికి సంబంధించి ఇప్పటికే దేశంలోని 29 రాష్ట్రాలు తమ బడ్జెట్లో నిధులను కేటాయించగా, 24 రాష్ట్రాలు సొంతంగా ప్రత్యేక నోటిఫికేషన్లను కూడా విడుదల చేశాయి. అయితే ఈ చారిత్రాత్మక చట్టాన్ని జాతీయ స్థాయిలో అధికారికంగా ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ను వేదికగా ఎంచుకుంది. జూలై 2వ తేదీ (గురువారం) నాడు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా, ఓబులవారిపల్లె మండలం పరిధిలోని ముక్కావారిపల్లి గ్రామం నుంచి ఈ VB-G RAM G చట్టాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు కొత్త గ్రామీణ ఉపాధి గ్యారెంటీ కార్డులను పంపిణీ చేయడంతో పాటు, పథకానికి సంబంధించిన అవగాహన సామాగ్రిని కూడా విడుదల చేయనున్నారు. రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జల సంరక్షణ, వ్యవసాయం, ప్రకృతి వనరుల నిర్వహణ మరియు మహిళా సాధికారత వంటి రంగాలపై ఈ పథకం ప్రత్యేక దృష్టి పెట్టనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande