
న్యూఢిల్లీ, 18 జూలై (హి.స.)
:నీట్ (NEET) పరీక్షా అక్రమాలకు వ్యతిరేకంగా
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న
ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు శనివారం తెల్లవారుజామున
బలవంతంగా ఆసుపత్రికి తరలించడంపై తీవ్ర వివాదం రేగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP)
కార్యకర్తలు ఢిల్లీ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. నిరసన స్థలంలో
శాంతియుతంగా దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్‌ను పోలీసులు ఈడ్చుకుంటూ, బలవంతంగా వాహనంలోకి నెట్టి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారని సీజేపీ
కార్యకర్తలు ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు తమపై లాఠీచార్జ్ చేశారని, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో పాటు పలువురు నాయకులను
అదుపులోకి తీసుకున్నారని వారు పేర్కొన్నారు.
అయితే ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు
ఖండించారు. తాము చట్టప్రకారమే వ్యవహరించామని న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్
పోలీస్ (DCP) సచిన్ శర్మ స్పష్టం చేశారు. సుదీర్ఘంగా
సాగిన నిరాహార దీక్ష కారణంగా వాంగ్‌చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, వైద్య నిపుణుల బృందం ఇచ్చిన నివేదిక మరియు ఢిల్లీ హైకోర్టు జారీ
చేసిన ఆదేశాల ప్రకారమే ఆయన ప్రాణాలను కాపాడటానికి అత్యవసరంగా ఆసుపత్రికి
తరలించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
వైద్యుల సూచనల మేరకు వాంగ్‌చుక్‌కు తక్షణ
చికిత్స అందించడం అత్యవసరమని, అందుకే ఈ చర్య తీసుకున్నామని పోలీసులు
వివరించారు. పోలీసులు ఆయనను తరలిస్తున్న సమయంలో నిరసనకారులు అడ్డుకోవడానికి
ప్రయత్నించడంతో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది. పరిస్థితిని
అదుపులోకి తెచ్చేందుకు నిరసనకారులను అక్కడి నుంచి చెదరగొట్టామని, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే జంతర్ మంతర్ ప్రాంతాన్ని ఖాళీ చేయమని
కోరామని ఢిల్లీ పోలీస్ అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi