
శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్, 18 జూలై (హి.స.)
):
భారతదేశ వాణిజ్య అంతరిక్ష రంగంలో
సరికొత్త చరిత్ర లిఖిస్తూ, దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్
క్లాస్ రాకెట్ విక్రమ్-1 (Vikram-1) తొలి
ప్రయోగాత్మక పరీక్షకు సిద్ధమైంది.హైదరాబాద్‌కు
చెందిన ప్రముఖ స్పేస్ స్టార్టప్ సంస్థ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ (Skyroot
Aerospace) ఈ ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని శనివారం ఉదయం 11:30 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC-SHAR)
మొదటి లాంచ్ ప్యాడ్ నుండి చేపట్టనుంది. మిషన్
ఆగమన్ (Mission Aagaman) పేరుతో నిర్వహిస్తున్న ఈ చారిత్రాత్మక
ప్రయోగంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
భారత అంతరిక్ష ప్రస్థానంలోనే ఇదొక
మైలురాయి అని, ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశీయ పరిశ్రమలకు
సరికొత్త అవకాశాలు లభిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.విక్రమ్-1 రాకెట్ పూర్తి స్వదేశీ సాంకేతికతతో,
తేలికపాటి కార్బన్-కాంపోజిట్ నిర్మాణంతో రూపొందించబడింది.ఇది మూడు సాలిడ్-ఇంధన దశలు, ఒక లిక్విడ్-ఇంధన ఆర్బిటాల్ అడ్జస్ట్‌మెంట్ మాడ్యూల్‌తో పనిచేసే
ఫోర్-స్టేజ్ రాకెట్.దాదాపు 350
కిలోల బరువున్న ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల
దూరంలో ఉన్న దిగువ కక్ష్యలోకి (Low Earth Orbit) చేర్చగల
సామర్థ్యం దీనికి ఉంది.ఈ
రాకెట్‌లో మెటాలిక్ 3D-ప్రింటెడ్ ఇంజన్లను ఉపయోగించడం విశేషం.
ఈ చారిత్రాత్మక ప్రయోగంపై ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ, స్కైరూట్
బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. భారత అంతరిక్ష
ప్రయాణంలో ఇదొక చారిత్రాత్మక సరికొత్త సరిహద్దు (Historic new
frontier) అని ప్రధాని మోదీ కొనియాడారు.ఈ మిషన్ మన యువతలోని ప్రతిభ, పట్టుదల, వ్యవస్థాపక స్ఫూర్తిని చాటిచెబుతోందని,
2020లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అంతరిక్ష రంగ సంస్కరణలు నవకల్పనలకు ఎలా
దారి తీశాయో చెప్పడానికి ఇదొక నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.దేశంలోని యువత అంతా ఈ చారిత్రాత్మక
క్షణాన్ని వీక్షించాలని, #IndiaWithVikram1 హ్యాష్‌ట్యాగ్‌తో
మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ ప్రయోగంలో మరో అత్యంత ఆసక్తికరమైన అంశం
ఏమిటంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వహస్తాలతో వందేమాతరం అని రాసిన
ఒక ప్రత్యేక పోస్ట్‌కార్డు ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లనుంది.ప్రధాని సందేశంతో పాటు ఇస్రో (ISRO)
ప్రస్తుత, మాజీ చైర్మన్లు, భారతీయ
వ్యోమగాములు, పెట్టుబడిదారులు, ప్రపంచవ్యాప్త
అభిమానులు పంపిన వందలాది ఆకాంక్షల లేఖలను కూడా ఈ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి
తీసుకెళ్తున్నారు.వీటితో పాటు
బెంగళూరుకు చెందిన కాస్మోస్ డైమండ్స్ తయారుచేసిన ల్యాబ్-గ్రోన్ డైమండ్ ఆర్ట్‌వర్క్
‘డైమండ్ లోటస్’, గ్రాహా స్పేస్, కాస్మోసెర్వ్,
జర్మనీకి చెందిన డిక్యూబ్డ్ సంస్థల సాంకేతిక పరికరాలు (Payloads)
ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశించనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi