
న్యూఢిల్లీ:, 18 జూలై (హి.స.)
ప్రముఖ సామాజిక, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను
ఢిల్లీ పోలీసులు శనివారం తెల్లవారుజామున జంతర్ మంతర్ నిరసన స్థలం నుండి బలవంతంగా
తరలించి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. నీట్
(NEET) పరీక్షా అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర
ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో వాంగ్‌చుక్ గత 21 రోజులుగా నిరవధిక
నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో
పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
అయితే, ఈ
పరిణామంపై సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జె. ఆంగ్మో
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి
తరలించారని, తన స్పష్టమైన లిఖితపూర్వక అనుమతి (Consent)
మరియు వారి కుటుంబ వైద్యుడి సంప్రదింపులు లేకుండా ఆయనకు ఎలాంటి వైద్య
చికిత్సను అందించవద్దని ఆమె అధికారులను హెచ్చరించారు.
ఈ సందర్భంగా గీతాంజలి మీడియాతో
మాట్లాడుతూ, ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు.
నా అనుమతి లేకుండా ఆయనకు ఏ మందూ ఇవ్వకూడదని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. మా
డాక్టర్ అనుమతి లేకుండా ఎలాంటి చికిత్స ప్రారంభించకూడదు. ఒకవేళ ఆయనకు ఏమైనా
జరిగితే అందరినీ బాధ్యులను చేస్తాను. నిన్నటి వరకు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది,
అసలు ఆసుపత్రికి తరలించాల్సిన అవసరమే రాలేదు. ఆర్టికల్ 32 ప్రకారం ఇది నాకున్న ప్రాథమిక హక్కు అని ఆమె స్పష్టం చేశారు.
మరోవైపు ఢిల్లీ పోలీసులు ఈ చర్యను
సమర్థించుకున్నారు. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం తీవ్రంగా
క్షీణించడంతో, వైద్య నిపుణుల సలహా మేరకు మరియు ఢిల్లీ
హైకోర్టు ఆదేశాల ప్రకారమే ఆయనను అత్యవసర వైద్య సంరక్షణ కోసం ఆసుపత్రికి తరలించామని
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (న్యూఢిల్లీ) సచిన్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు వాంగ్‌చుక్‌ను తరలిస్తున్న సమయంలో నిరసనకారులు
అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు, జంతర్
మంతర్ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని కోరారు.
నిరసనకారులు మాత్రం పోలీసులు తమపై
లాఠీచార్జ్ చేశారని, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను
అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. కాగా, ఆసుపత్రికి తరలించడానికి కొన్ని గంటల ముందే వాంగ్‌చుక్ ఆరోగ్యంపై
ఆందోళన వ్యక్తం చేస్తూ దీక్ష విరమించాలని ఆయన భార్య కోరినట్లు సమాచారం. దీక్ష కారణంగా తాను ఇప్పటికే తన శరీర బరువులో 20 శాతం కోల్పోయానని, అయినప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు కోసం
తన పోరాటాన్ని కొనసాగిస్తానని వాంగ్‌చుక్ శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఒక వీడియో
సందేశంలో పేర్కొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi