
హైదరాబాద్, 02 జూలై (హి.స.)
రామచంద్రాపురం మండల పరిధిలోని బండ్లగూడలో పఠాన్చెరు రైల్వే ట్రాక్ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేద ప్రజలకు అండగా ఉంటానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ సందర్భంగా రైల్వే స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న బాధితుల విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం బండ్లగూడలో పర్యటించారు. పఠాన్చెరు వరకు ఉన్న రైల్వే స్టేషను ఇక్కడ నిర్వహించలేమని రైల్వే అధికారులు పట్టాలను తొలగించి తీసుకెళ్లడంతో స్థానికులు అక్కడ ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు అదే అధికారులు వచ్చి ఇళ్లకు మార్కింగ్ వేసి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేయడంలో ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రజల సమక్షంలో రైల్వే అధికారులతో మాట్లాడారు.
భూములు కోల్పోయిన వారి పూర్తి వివరాలు, రైల్వే భూముల వివరాలను సేకరించి, రైల్వే అధికారులు మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానికులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైల్వే స్థలంలో ఇళ్లు నిర్మించుకోవడం తప్పేనని, అయినప్పటికీ పేదలకు న్యాయం చేయాలని వారి తరఫున అధికారులను కోరుతున్నామని అన్నారు. త్వరలోనే రైల్వే అధికారులతో కలిసి మరోసారి పర్యటిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రైల్వే స్టేషన్ ను సందర్శించారు. అక్కడ ఓ ప్రైవేట్ వ్యక్తి రైల్వే ప్రహరీకి గేటు ఏర్పాటు చేసి, రైల్వే స్టేషన్ను కబ్జా చేసి బోర్వెల్ తవ్వించిన విషయాన్ని గుర్తించారు. ఈ విషయం పై రైల్వే అధికారులకు ఫోన్ చేసి, ఇళ్లు నిర్మించుకున్న పేదలకు నోటీసులు ఇస్తూ, రైల్వే స్టేషన్ను కబ్జా చేసిన వారిని ఎలా ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు