అన్యాయంగా నా భార్యను బదిలీ చేశారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్యాయంగా నా భార్యను బదిలీ చేశారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS praveen


హైదరాబాద్, 02 జూలై (హి.స.)

తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా విభాగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్య, సీనియర్ అధికారిణి లక్ష్మీభాయిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా విధులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం ఆమెను ఆ బాధ్యతల నుంచి బదిలీ చేసి, హౌసింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా నియమించారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారుల బదిలీల పరంపరలో భాగంగానే ఈ కీలక స్థానచలనం జరిగినట్లు సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం ఆమె త్వరలోనే హౌసింగ్ ఫెడరేషన్ ఎండీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

అయితే, తన సతీమణికి జరిగిన బదిలీపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ బదిలీలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కానీ, తాము అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చామని స్పష్టం చేశారు. పొలిటికల్గా తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. అందులో భాగంగానే తొలుత తన భద్రతను తగ్గించారని కామెంట్ చేశారు. ఆ అంశంపై తాను హైకోర్టును(High Court) ఆశ్రయించడంతో అక్కడ పాక్షిక ఉపశమనం లభించిందన్నారు. తనకు రిలీఫ్ దక్కడంతో అదే జీర్ణించుకోలేకనే ఈ కుఠిల ప్రభుత్వం.. ఇప్పుడు తన సతీమణిని అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఆమెకు అసలే సంబంధం లేని ఇతర విభాగానికి బదిలీ చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇలాంటి బెదిరింపులకు, కక్షసాధింపు చర్యలకు తాము భయపడేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాడుతూనే ఉంటామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande