
ఖమ్మం, 02 జూలై (హి.స.)
నకిలీ పోలీసులుగా నటిస్తూ అమాయకులను మోసం చేస్తున్న ముఠా గుట్టును ఛేదించినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఐపీఎస్ తెలిపారు. గురువారం సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు. గత నెల 25న కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన కుర్రా గంగాధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తుపల్లి టౌన్ సీఐ టి. శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులు ఉండగా, 12 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండు తరలించినట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. దర్యాప్తులో ఏలూరు జిల్లా వెంకటాపురానికి చెందిన ఈద చంటి బాబు ప్రధాన సూత్రధారిగా గుర్తించినట్లు తెలిపారు. అతడు మరో 13 మందితో కలిసి సిమ్ కార్డులు ఉపయోగించి వివిధ వ్యక్తులకు ఫోన్ చేసి తాము రియల్ ఎస్టేట్ వ్యాపారులమని, తమ వద్ద ఉన్న బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవాలని ఉందని నమ్మించేవారని చెప్పారు. బాధితుల నుంచి రూ. 10 లక్షలు తీసుకుని వారి ఖాతాలో రూ.40 లక్షలు జమ చేస్తామని ఆశ చూపించి, డబ్బు తీసుకునే సమయంలో పిల్లల ఆట నోట్లతో నింపిన బ్యాగును ఇచ్చేవారని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు