మెరుగైన వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి : అడిషనల్ కలెక్టర్
మెరుగైన వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి : అడిషనల్ కలెక్టర్
Collector


యాదాద్రి కలెక్టరేట్, 02 జూలై (హి.స.)

స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు మెరుగైన సమగ్ర ఆరోగ్య పరీక్షల నిర్వహించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యుల సమగ్ర ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు గురువారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్ లో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 1,94,493 మంది స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఉన్నారని తెలిపారు. వారందరికీ దశలవారీగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మూడు నెలల వ్యవధిలో పూర్తి చేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని పోచంపల్లి, షారాజీపేట్, బీబీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మాస్టర్ ట్రైనింగ్ కేంద్రాలుగా గుర్తించి, ఒక్కో కేంద్రం నుంచి ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ అందించినట్లు తెలిపారు. శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్ల ద్వారా జిల్లాలోని మిగిలిన ఆరోగ్య సిబ్బందికి దశలవారీగా శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీ-డయాగ్నోస్టిక్స్ రాష్ట్ర సమన్వయకర్త శ్రీ భరత్ పాల్గొని, సమగ్ర ఆరోగ్య పరీక్షల నిర్వహణ విధానం, నమూనాల సేకరణలో పాటించాల్సిన ప్రమాణాలు, డేటా నమోదు, నాణ్యత నియంత్రణ, నివేదికల నిర్వహణ తదితర అంశాలపై వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు మరియు సంబంధిత శాఖల సిబ్బందికి సవివరంగా శిక్షణ అందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande