
తిరుపతి, 02 జూలై (హి.స.)
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ‘శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ’ (SIU) అధికారికంగా ప్రారంభమైంది. తిరుపతి జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక క్లస్టర్ శ్రీసిటీలో ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ప్రారంభించారు. శ్రీసిటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సుమారు రూ.250 కోట్ల పెట్టుబడితో ఈ అత్యాధునిక క్యాంపస్‌ను నిర్మించింది.భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యూనివర్సిటీలో ‘ఇండస్ట్రీ-లెడ్ వర్క్-స్టడీ డ్యుయల్ ఎడ్యుకేషన్ మోడల్’ (పని చేస్తూ చదువుకునే విధానం)ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే తరగతి గది చదువుతో పాటు శ్రీసిటీలోని అంతర్జాతీయ పరిశ్రమలలో ప్రాక్టికల్ శిక్షణ పొందుతూ నెలకు రూ.10,000 కు పైగా స్టైపెండ్ సంపాదించుకోవచ్చు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి (2026-27) గానూ కంప్యూటర్ సైన్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, ఫైనాన్స్, డిజిటల్ మార్కెటింగ్ రంగాలలో నాలుగు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ యూనివర్సిటీలో 35 శాతం సీట్లను స్థానిక మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వ కోటా కింద కేటాయించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi