
అమరావతి, 03 జూలై (హి.స.)
:రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది 4,58,336 మంది ప్రవేశ పరీక్షలు రాయగా వారిలో 3,62,751 మంది అర్హత సాధించారు. ఈఏపీసెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఈ ఏడాది వివిధ కోర్సులకు నిర్వహించిన ప్రవేశ పరీక్షల వివరాలను ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జరిగిన ఈఏపీసెట్కు 3,29,474 మంది హాజరు కాగా, వారిలో 2,45,863 మంది అర్హత సాధించారు. అలాగే బీటెక్ లేటరల్ ఎంట్రీ అడ్మిషన్లకు నిర్వహించిన ఈసెట్లో 29,750 మంది, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం జరిగిన ఐసెట్లో 21,205 మంది, ఎంటెక్, ఎంఫార్మ్, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీజీఈసెట్లో 9,320 మంది, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ గ్రూపుల్లో అడ్మిషన్లకు జరిగిన పీజీసెట్లో 15,020 మంది, లాసెట్లో 19,197 మంది, బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్సెట్లో 19,741 మంది, వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు జరిగిన పీఈసెట్లో 2,655 మంది అర్హత సాధించారు. కాగా, ఈ ఏడాది అన్ని ప్రవేశ పరీక్షలను సకాలంలో పూర్తిచేశామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి తెలిపారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ సారథ్యంలో అన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించగలిగామని పేర్కొన్నారు.
20 తర్వాత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్!
ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ఈ నెల 20 తర్వాత కౌన్సెలింగ్ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 2026-27 విద్యా సంవత్సరానికి ఫీజుల అంశం ఇంకా కొలిక్కి రాలేదు. గతంలో ఖరారు చేసిన ఫీజుల కాలపరిమితి ముగిసిపోయింది. అయినా ప్రభుత్వం ఇప్పటివరకూ ఉన్నత విద్య ఫీజుల కమిటీని నియమించలేదు. దీంతో అడ్మిషన్ల ప్రక్రియను 20 తర్వాత చేపట్టాలని భావిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ