చీము, నెత్తురు ఉంటే మంత్రి జూపల్లి రాజీనామా చేయాలి.. హరీష్ రావు
చీము, నెత్తురు ఉంటే మంత్రి జూపల్లి రాజీనామా చేయాలి.. హరీష్ రావు
Harish Rao


సంగారెడ్డి, 03 జూలై (హి.స.)

ఓట్ల తొలగింపు కుట్రలను తిప్పి కొట్టాలని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, సంగారెడ్డిలో ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ సర్కార్ కు తగిన గుణపాఠం తప్పదని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. సంగారెడ్డిలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం, సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, మంత్రుల అబద్ధాలను ఎండగట్టారు. సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు మాణిక్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, శశిధర్ రెడ్డి, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జూపల్లి కృష్ణారావు మళ్లీ ప్రెస్ మీట్ పెట్టిండు. నిన్న వాళ్లు గోల్ కొడుదాం అనుకుంటే సెల్ఫ్ గోల్ అయిపోయిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అందుకే డ్యామేజ్ కంట్రోల్ మొదలు పెట్టారని, అందులో కూడా పప్పులో కాలు వేశారు. దాని సంగతి ఏందో చూద్దామన్నారు. మొన్న సవాల్ విసిరి నిన్న తోక ముడిచి నాకు వాట్సాప్ లో ఒక ఉత్తరం పెట్టిండు. పూటకో సవాలు.. రోజుకో అడ్రస్ లెక్క ఉంది జూపల్లి సంగతి అని విమర్శించారు. మొదలేమో తెలంగాణ భవన్ అన్నాడు.. తర్వాత అమరవీరుల స్థూపం అన్నాడు.. ఇప్పుడేమో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటుండు. ముందు నన్ను, కేటీఆర్ను చర్చకు రమ్మన్నాడు.. ఇప్పుడు కేసీఆర్ను రావాలంటున్నారు.

2023 డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఆర్బీఎం కింద తెచ్చిన అప్పు రూ.1,86,087 కోట్లు అయితే.. ఆయన నాకు రాసిన ఉత్తరంలో రూ.1,77,058 కోట్లు అని చెప్తుండు. మరి ఆ రూ.10 వేల కోట్లు ఎక్కడికి పోయినయి..? అని హరీష్ రావు ప్రశ్నించారు. మార్చి 18, 2026 నాడు అసెంబ్లీలో నేను గట్టిగా నిలదీస్తే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మా ప్రభుత్వం 27 నెలల్లో చేసిన అప్పు రూ.3,47,294 కోట్లు అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఇందులో ఏది నిజం? 4 నెలల కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది నిజమా..? మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పింది నిజమా..? అంటే ఇప్పుడు రాజీనామా ఎవరు చేయాలి? పాలమూరు బిడ్డవైతే.. పౌరుషం ఉంటే, చీము నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చెయ్యి మిస్టర్ జూపల్లి అని సవాల్ విసిరారు. నువ్వు కాదు, మీ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, మొత్తం మీ కేబినెట్ ను కూసోబెట్టి నిండు అసెంబ్లీలో బీఆర్ఎస్ చేసిన అప్పు 4 లక్షల కోట్లే అని నిరూపించిన, మీ అబద్ధాలను కడిగి పారేసిన. ఇప్పుడేదో వచ్చి చర్చిద్దాం అంటున్నవ్, అప్పుడు నేను సవాల్ చేస్తే అసెంబ్లీలోనే తలలు కిందవేసుకోని సప్పుడు చేయలేదు. సీనియర్ మంత్రి అంటూనే మీ క్యాబినెట్ ఎంత అప్పు చేసిందో తెల్వదా..? అని ఎద్దేవా చేశారు. కాగ్ రిపోర్టు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 4.15 లక్షల కోట్లు అని అసెంబ్లీలో చెప్పింది. నేనూ చెప్పింది, కాగ్ చెప్పింది ఒక్కటే. అబద్ధాలు చెబుతూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. జూపల్లి గారు నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐ లెక్కలు మీకు వాట్సప్ లో పంపుతున్నా చదువుకో.. చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయాలని సవాల్ విసురుతున్న అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఆశీర్వాదంతో మన సంగారెడ్డి జిల్లా, సదాశివపేట నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా నిధులు తీసుకొచ్చాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ హయాంలో మంజూరైన ఎన్డీఎఫ్ నిధులను కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చిందిన్నారు. అదే విధంగా సంగమేశ్వర - బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును అటకెక్కించి సంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తోంది. రేపు ఏడు మండలాల ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. సంగమేశ్వర ప్రాజెక్టు గురించి, బసవేశ్వర ప్రాజెక్టు గురించి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరోజైనా మాట్లాడారా..? అని హరీష్ రావు ప్రశ్నించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande