
హైదరాబాద్, 03 జూలై (హి.స.)
ఆర్అండ్్బ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు పనుల పురోగతిపై సచివాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్ అండ్ బీలోని విభాగాల వారీగా పనుల పురోగతిపై కూలంకషంగా చర్చించిన మంత్రి, చేపట్టిన కీలక పనులు ఏ దశల్లో ఉన్నాయో అధికారులను ఆరా తీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో న భూతో న భవిష్యత్ రీతిలో రాష్ట్రంలో అద్దం లాంటి రోడ్ల నిర్మాణానికి సంకల్పించామని, అందులో భాగంగా జూన్ 28న నల్లగొండ జిల్లా కనగల్ వేదికగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాష్ట్ర హ్యామ్ రోడ్ల పనుల పైలాన్ ఆవిష్కరణ చేసుకుని, పనులు ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో ఏ మూలన చూసినా నాణ్యమైన ఆర్ అండ్ బీ డబుల్ రోడ్లు వినియోగంలోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మంచి రోడ్డు - ప్రగతికి సూచిక అని తాను బలంగా విశ్వసిస్తానని, దీంతో పల్లె పట్టణాలకు కనెక్టివిటీ పెరిగి, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తె స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.
మొదటి ఫేజ్లో సుమారు 13 వేల కోట్లతో 6092 కి.మీ రోడ్ల పనులు 34 ప్యాకేజీల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనుండగా.. ఈ జూలై నెలలోనే 10 ప్యాకేజీల పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ప్యాకేజ్-2లో సుమారు రూ.155 కోట్ల అంచనా వ్యయంతో 42కి.మీ పొడవుగల నల్లగొండ-మహబూబ్ నగర్ డబుల్ రోడ్డు పనులు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో పనుల్లో వేగం పెంచాలన్నారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో లేవని, అయినా.. వర్షాకాలం పూర్తి అయిన తర్వాత మూడు షిఫ్టుల్లో(రాత్రి వేళల్లో కూడా) రోడ్ల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు.
అట్లాగే ఉస్మానియా జనరల్ ఆసుపత్రి పనుల్లో ఇంకా వేగం పెరగాలని, ఇది కూడా డిసెంబర్ 2027 వరకు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. సనత్ నగర్ టిమ్స్ ప్రారంభానికి సిద్ధం అయిందని, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్, నిమ్స్ విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణ పనులు వేగవంతం చేసి అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా పని చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టుల్లో టెక్నికల్ నాలెడ్జ్ ఉండి, మనసుపెట్టి పనిచేసే కమిట్మెంట్ ఉన్న ఇంజినీర్లను నియమించాలని మంత్రి సూచించారు. ఈ వారం నుండే నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో ఆకస్మిక సైట్ విజిట్స్ చేస్తానని.. పనుల పురోగతిలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తన దృష్టికి వస్తే, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని, కఠిన చర్యలు తప్పవని సున్నితంగా హెచ్చరించారు. బాసర, భద్రాచలం ఆలయ నిర్మాణ పనుల పురోగతి, గోదావరి పుష్కరాల కోసం ఆర్ అండ్ బీ ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. సంబంధిత ఆయా శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఆర్ అండ్ బీ తరుపున నిర్మాణ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకొని పని చేయాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు