తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్: నేటి నుండి 7 రోజుల పాటు దంచికొట్టనున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్: నేటి నుండి 7 రోజుల పాటు దంచికొట్టనున్న వర్షాలు
rain


హైదరాబాద్, 03 జూలై (హి.స.)

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జులై 3 నుండి జులై 9 వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు ఉమ్మడిగా వాతావరణ బులెటిన్‌ను విడుదల చేశాయి. రాబోయే 7 రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేశాయి.

తెలంగాణ వాతావరణ సూచన (జులై 3 - 9):

తెలంగాణ వ్యాప్తంగా జులై 9 వరకు విడతల వారీగా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

జులై 3 - 4: ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

జులై 4 - 5: ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

జులై 5 - 9: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు నిరంతరాయంగా కురుస్తూనే ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచన

ఏపీలోని ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే 7 రోజుల పాటు వాతావరణంలో తీవ్ర మార్పులు ఉంటాయి. కోస్తాంధ్రాలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. అయితే, రాబోయే ఐదు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలలో ఎలాంటి పెద్ద మార్పులు ఉండబోవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande